Bumrah Award: బూమ్.. బూమ్ బుమ్రా.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్టార్ పేసర్.. కమిన్స్ కు షాక్..
సొంతగడ్డపై ఆసీస్ ప్లేయర్లకు బుమ్రా చుక్కలు చూపించాడు. ఆసీస్ టూర్లో బుమ్రాను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. తను గాయంతో దూరం కావడంతో ఐదో టెస్టును గెలిచారనే విశ్లేషణ కూడా ఉంది.
Bumrah Vs Cummins: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2024 డిసెంబర్ నెలకు గాను క్రికెటర్ ఆఫ్ ద మంత్ గా నిలిచాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బుమ్రా.. మూడు టెస్టుల్లో అదరగొట్టాడు. మొత్తం 22 వికెట్లతో సత్తా చాటాడు. జట్టులో ఒక్క బుమ్రా మాత్రమే చాలా ఎఫెక్టివ్ గా కనిపించాడు. మిగతా బౌలర్లు తేలిపోవడంతో సిరీస్ లో భారత్ వెనుకబడింది. అయితే బుమ్రా మాత్రం చాలా ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి ఈ సిరీస్ ఆద్యంతం బుమ్రాను భారత అభిమానులే కాదు, ఆసీస్ దిగ్గజాలు, ఫ్యాన్స్ కూడా పొగిడారంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ డేన్ పాటర్సన్ లతో పోటీపడిన బుమ్రా.. ఏకపక్షంగా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
బీజీటీలో విశ్వరూపం..
ఇక ఆసీస్ పర్యటనలో భారత్ ఐదు టెస్టుల మ్యాచ్ లు ఆడింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అని పిలిచే ఈ సిరీస్ లో బుమ్రా రెచ్చిపోయాడు. ఓవరాల్ గా 32 వికెట్లతో అదరగొట్టాడు. రెండో స్థానంలో ఉన్న కమిన్స్ (25 వికెట్లు)పై స్పష్టమైన ఆధిక్యం చూపించాడు. నిజానికి ఈ సిరీస్ ఆద్యంతం బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అని విశ్లేషణ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు బుమ్రా వాడి ఎలా సాగిందో. ఈ సిరీస్ లోనే బుమ్రా తన కెరీర్ లో కొన్ని మైలురాళ్లను అధిగమించాడు. టెస్టుల్లో 19 సగటుతో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్లో ఇంత తక్కువ సగటుతో ఏ బౌలర్ కూడా 200 వికెట్లు తీయలేదు. అలాగే అత్యంత వేగవంతంగా 200 వికెట్లను తీసిన భారత పేసర్ గా గుర్తింపు పొందాడు. కేవలం తన 44వ టెస్టులోనే బుమ్రా ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే 2001లో హర్భజన్ సింగ్ నెలకొల్పిన బీజీటీలో అత్యధిక వికెట్ల రికార్డును బుమ్రా 32 వికెట్లతో సమం చేశాడు. అలాగే ఆసీస్ గడ్డపై ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బీఎస్ చంద్ర శేఖర్ రికార్డు (31 వికెట్ల)ను కొల్లగొట్టాడు.
చివరి టెస్టులో గాయం..
నిజానికి సిడ్నీలో జరిగిన వెన్ను నొప్పితో బాధ పడిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. లేకపోతే మరిన్ని రికార్డులను తన ఖాతాల వేసుకునేవాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడంతో పండుగ చూసుకున్న ఆసీస్ బ్యాటర్లు ఆరు వికెట్లతో విజయాన్ని సాధించారు. దీంతో భారత్ 1-3తో సిరీస్ ఓడిపోయింది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి ఔటయ్యింది. ఇక బుమ్రా గాయం గురించి బీసీసీఐ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. తను వచ్చేనెలలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతాడో లేదోనని డౌటనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఏదేమైనా చివరి లీగ్ మ్యాచ్ లకైనా బుమ్రా అందుబాటులో ఉంటాడని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చేనెలలో ఈ టోర్నీ పాక్ లో జరుగుతుండగా, తను ఆడే మ్యాచ్ లను మాత్రం దుబాయ్ లో భారత్ ఆడనుంది. 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్ తో టీమిండియా ఆమీతుమీ తేల్చుకోనుంది.
Also Read: BCCI Fire: బీసీసీఐ కొత్త నిబంధనలు - ఇకపై ప్లేయర్లు, కోచ్ గంభీర్‌కు కష్ట కాలమేనా!