Maoist Damodar : మావోయిస్టులకు బిగ్ షాక్- ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి
Maoist Damodar Alias Bade Chokka Rao : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు.

Maoist Damodar Alias Bade Chokka Rao Killed In Encounter : మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 16 గురువారం రోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్ట్ పార్టీనే నిర్థారించింది. రెండు రోజుల క్రితం మావోలకు, భద్రతా దళాలకు జరిగిన భీకర దాడిలో చొక్కారావుతో పాటు మరో 18మంది నక్సల్స్ మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
ఎవరీ బడే చొక్కారావు ?
బడే చొక్కారావు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఆయన.. ప్రారంభంలో మిలిటరీ చీఫ్ గా పని చేశారు. ఆ తర్వాత మావో పార్టీలో చేరి.. 30 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో భాగమయ్యారు. వివిధ హోదాల్లోనూ పని చేశారు. కరోనాతో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. కేంద్ర కమిటీ బడే చొక్కారావుకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక కొంతకాలంగా పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా పేరొందిన చొక్కారావుపై తెలంగాణలో రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం, ల్యాండ్ మైన్ పేల్చడం వంటి ఘటనల్లోనూ చొక్కారావు కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు చొక్కారావు ఎదురుకాల్పుల్లో మరణించిగా.. ఆయన భార్య రజితను 2023లోనే అరెస్ట్ చేసినట్టు సమాచారం. చొక్కారావు అన్న బడే నాగేశ్వర్ రావు కూడా 20ఏళ్ల క్రితమే ఎన్ కౌంటర్ లో చనిపోయారు.
Also Read: నాగోబా జాతర ప్రధాన ఘట్టం పూర్తి- మెస్రం వంశీయులు గంగాజలం ఎలా సేకరిస్తారంటే..!
దద్దరిల్లుతోన్న ఛత్తీస్‌గఢ్ అడవులు
2024 ప్రారంభం నుంచి ఛత్తీస్‌గఢ్ అడవులు వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టు పార్టీ తొలి తరం నేత మాచర్ల ఏసోబు కూడా గతేడాది ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన పోలీసుల అన్‌స్టాపబుల్ ఆపరేషన్‌కు గత రెండేళ్లలోనే 800 మావోయిస్టులు లొంగిపోగా.. ఒక్క 2024లోనే 200మందికిపైగా సరెండర్ అయ్యారు. 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ‘ఆపరేషన్ సమాధాన్’ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని నామ రూపాల్లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదు. కానీ ఎలాగైనా తమ లక్ష్యాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోన్న మాట.





















