Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్ సెస్
Andhra Pradesh: వాహనాలపై జీఎస్టీ తగ్గిందని ఆనందపడే ఏపీ వాసులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రోడ్ సెస్ పేరిట పది శాతం పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండగ సమయంలో ప్రజలకు షాక్ ఇచ్చింది. వాహనాల కొనుగోలుపై పది శాతం రోడ్ సెస్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ చట్టంలోని రూల్స్ సవరిస్తూ ఈ ఆదేశాలు వెల్లడించింది ప్రభుత్వం. ఇకపై వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తులు పదిశాతం రోడ్డు సెస్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏటా 70 వేలకుపైగా వాహనాలు కొనుగోలు జరుగుతుందని దీంతో 270 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని పది శాతం తగ్గించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆమేరకు రోడ్ సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిన తర్వాత అన్నివాహనాలపై 28 శాతం పన్ను విధించింది. అయితే ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో గత సెప్టెంబర్ నుంచి ఆ పన్ను పరిధిని 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ప్రజలకు భారీ ఊరట లభించింది. లగ్జరీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై మాత్రం అదే స్థాయిలో జీఎస్టీని కొనసాగిస్తున్నారు. పదిశాతం జీఎస్టీ తగ్గిన తర్వాత వాహనాల కొనుగోలుదారులు చాలా వేగంగా పెరిగారు. వాహనాల కొనుళ్లు భారీగా పెరిగాయి.
కేంద్రం తగ్గించిన పది శాతం జీఎస్టీని రోడ్ సెస్‌గా మార్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏదో రూపంలో గట్టెక్కించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. అందుకే ప్రజలందరిపై భారం లేకుండా ఉండేలా కేవలం భరంచగలిగే వారిపై భారం మోపేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు గత వారంలో సమావేశమైన మంత్రివర్గం రోడ్డు సెస్ పేరుతో కొత్త వాహనాలపై పది శాతం సెస్ విధించాలని నిర్ణయించింది. దీని ప్రకారం అధికారిక ఉత్తర్వులు మంగళవారం విడుదల చేసింది.





















