Apple CEO Tim Cook : ఆపిల్ సీఈవో తండ్రి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్ - పోడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో టిమ్ కుక్ వెల్లడి
Apple CEO Tim Cook : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న ఓ కథనాన్ని పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆపిల్ వాచ్ తన తండ్రి జీవితాన్ని ఎలా కాపాడిందో వివరించారు.

Apple CEO Tim Cook : ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, పెద్ద కంపెనీలలో ఆపిల్ ఒకటి. ఈ ఉత్పత్తులను కొనడం చాలా మంది ఓ కలగా భావిస్తుంటారు. అయితే ఆపిల్ వాచ్ ప్రాణాలను కాపాడుతుందని, కాపాడిందని ఇప్పటికే చాలా మంది చెప్పారు. తమకెదురైన సంఘటనలను సైతం సోషల్ మీడియాలో పంచుకోవడం చూసే ఉంటాం. తాజాగా అదే విషయాన్ని రుజువు చేస్తూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తన పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులను వివరించారు. ఆపిల్ వాచ్ తన తండ్రి ప్రాణాలను ఎలా కాపాడిందో వివరించారు.
ఆపిల్ వాచ్ తో అలా నా తండ్రిని కాపాడుకున్నా..
ఆపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని టిమ్ కుక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి నొక్కి చెప్పారు. అందుకు ఉదాహరణగా తన లైఫ్ లో తన తండ్రికి జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఆపిల్ వాచ్‌లో మెడికల్ అలర్ట్ ఫీచర్ ఉందని చెప్పారు. ఇది ఒకరి ప్రాణాలను కాపాడుతుందన్నారు. మా నాన్న ఒంటరిగా ఉంటున్నారు. ఓ రోజు ఆయన నేల మీద పడ్డాడు. వెంటనే ఆపిల్ వాచ్ నాకు నోటిఫికేషన్ పంపింది. వెంటనే ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇంటికి వెళ్లాను. మా నాన్న ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి ఆయన ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పారు.
Also Read : Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టునున్న ఆర్థిక మంత్రి.. 8 కీలక అంచనాలు ఇవే
ఇష్టమైన ఆహారం.. రోజూవారి జీవితం
ఇదే ఇంటర్వ్యూలో టిమ్ కుక్ తనకు ఇష్టమైన ఆహారం ఏంటీ, రోజూ వారి జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తికర విషయాలనూ పంచుకున్నారు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానన్నారు. రోజూ ఉ.5గంటలకు ముందే మేల్కొంటానని, ఆ సమయంలో కొన్ని మెయిల్స్ కు రిప్లై ఇస్తానని చెప్పారు. కుక్ వారానికి నాలుగు రోజులు ఆపిల్ పార్క్‌లో, శుక్రవారం ఇంటి నుండి పని చేస్తానన్నారు. కుక్ చార్డొన్నే, డార్క్ చాక్లెట్, హైకింగ్‌లను ఇష్టపడతారని, తరచుగా పార్కులకు వెళ్తుంటారన్నారు.
ఇష్టమైన ఆహారం విషయానికొస్తే.. చేపలు, జీడిపప్పు తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్స్, బ్రోకలీ వంటి పోషకమైన ఆహారాన్ని ఇష్టపడతారట. ఇకపోతే ఆపిల్ వాచ్ ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కాపాడిందని, అందుకు సంబంధించిన విషయాలను, తాము ఎదుర్కొన్న పరిస్థితులను చాలా మంది మెయిల్ ద్వారా ఇప్పటికే పంచుకున్నారని, వాటిని చదవుతుంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని కుక్ తెలిపారు.





















