Bhumana Karunakar Reddy: మాడ వీధుల్లో కూడా చెప్పులతో తిరుగుతున్నారు, టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని దురాగతాలు: భూమన కరుణాకర్ రెడ్డి
Andhra Pradesh News | తిరుమల కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. కొండపైకి మద్యం.. బిర్యానీ పొట్లాలు వెళ్ళాయి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.

Tirumala News | తిరుపతి: కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో అన్ని అపచారాలే జరుగుతున్నాయని, వాటికి శిక్ష తప్పదన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. టిటిడి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దురాగతాలు జరుగుతున్నాయని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. కొండపైకి బిర్యానీ పొట్లాలు వెళ్ళాయి, మద్యం కూడా కొండపై దొరికిందని భూమన ఆరోపించారు.
కొండపైకి మద్యం.. బిర్యానీ పొట్లాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో బాలుడు మృతి చెందాడు, ఎల్లో మీడియాకు అది కనిపించలేదు. కొండపైకి మద్యం వెళ్లి దొరికింది. బిర్యానీ పొట్లాలు కూడా దొరికాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. పాప ప్రక్షాళన చేస్తానని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ తిరుమలలో తొక్కిసలాటపై విచారణకు ఆదేశిస్తే, లేఖ ఎందుకు రద్దు చేయించారు. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. తిరుమల పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం అంటోంది. అమిత్ షా ఏపీకి వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారు.
పశువుల దొడ్డిలో తోసినట్లు భక్తులను
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేయించారు. చంద్రబాబు పాపాల పుట్ట కొండగా మారింది. పశువుల దొడ్డిలో తోసినట్లు భక్తులను క్యూలైన్ లో తోసి పెట్టారు. అసలు బాధ్యులైన టిటిడి ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్లపై చర్యలకు బదులుగా జిల్లా ఎస్పీని బదిలీ చేశారు క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి టిటిడి నుంచి ప్రత్యేక బృందాన్ని అయోధ్య రామాలయానికి పంపిన ఘనత మాది. న్యూస్ చానల్ అధినేత బి.ఆర్.నాయుడుకు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. టీటీడీ చైర్మన్ టీడీపీ నేతల సేవలో తరిస్తున్నారు.
లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ తిరుమలలో 4 సార్లు దొరికింది. ఆరు మంది భక్తులు చనిపోతే ఎల్లో మీడియా కనీసం పట్టించుకోలేదు. ప్రభుత్వం న్యాయ విచారణ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం స్పందించే చర్యలకు ఆదేశిస్తే, లేఖను రద్దు చేయించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్ణాటకకు చెందిన సునీత గౌడ అనే భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్పాలంకరణ చేస్తే బయట పెట్టేశారు. సనాతన ధర్మం కాపాడతామన్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు చెందిన అటవీ శాఖలోనే అక్రమాలు జరుగుతున్నాయి.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందలేదు
మాడ వీధుల్లో కూడా చెప్పులతో తిరుగుతున్నారంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. భయం, భక్తి లేకుండా పోయింది. ఈ తప్పులకు శిక్ష తప్పదు. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టిడిపి, బీజేపీ జనసేన నాయకులు తిరుమల టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ క్యూలైన్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలకు 25 లక్షలు ఇస్తామని ప్రకటించి.. టిటిడి నుంచి ఆ నగదు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. అంటే మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని’ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.






















