Adilabad Latest News : అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
Adilabad Latest News :ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అప్పు చెల్లించాలని అధికారులు చేస్తున్న ఒత్తిడి భరించలేక ఓ రైతు బ్యాంకులోనే సూసైడ్ చేసుకున్నాడు. ఇది స్థానికంగా సంచలనంగా మారింది.

Adilabad Latest News : బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని బ్యాంక్ అధికారులు వేధింపులకు పాల్పడడంతో అదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవరావ్ ఈ పని చేశాడు.
జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఐసిఐసీఐ బ్యాంక్‌లో దేవరావ్ మార్ట్ గేజ్ రుణం తీసుకున్నాడు. వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో బ్యాంకు ఉద్యోగులు పదే పదే అడిగారు. దీంతో బ్యాంకులోకి మందు డబ్బా తీసుకుని వచ్చిన ఆయన అక్కడే మందు తాగాడు. ఆయనను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
బ్యాంకు సిబ్బంది, అధికారుల వేధింపుల వల్లనే మృతి చెందాడని ఆరోపిస్తు కుటుంబ సభ్యులు, బంధువులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. మృతి చెందిన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు ఎదుట ఆందోళన జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు, అదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్నారు. అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారులు ఒత్తిడితోనే ఆత్మహత్య
దేశానికి అన్నం పెట్టే రైతన్న బ్యాంకర్లు పెట్టిన బాధలు భరించలేక, జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రేణిగుడా గ్రామానికి చెందిన జాదవ్ దేవరావ్ కుటుంబ సభ్యులు ఆందోళన విషయం తెలుసుకొని స్పాట్‌కు వచ్చారు. కుటుంబ సభ్యులతో, బ్యాంక్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ రైతు ఐసీఐసీఐసీఐ బ్యాంక్‌లో పొలాలను మార్టిగేజ్ చేసి నాలుగు లక్షల అప్పు తీసుకున్నాడు. ఆరు నెలలకు ఒకసారి వాయిదా పద్ధతిలో రుణాలు చెల్లిస్తూ వచ్చాడు. ఈసారి పంటలు పండగ పోవడంతో వాయిదా రెండు నెలలు ఆలస్యమైంది. ఈ విషయమై బ్యాంక్ అధికారులు తరచు ఇంటికి వెళ్లి ఇబ్బందులకు గురి చేశారు. మనస్థాపానికి గురైన రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల బాకీలున్న బడా బాబులకు నోటీసులు ఇస్తారు. రైతులను మాత్రం హింసిస్తున్నారని మండిపడ్డారు. తాకటటు పెట్టిన పొలాన్ని అమ్మిన రూపాయలు 50 లక్షలు వస్తాయన్నారు. నాలుగు లక్షల అప్పు ఈఎంఐ కోసం రైతును అవమానపరడం సరి కాదన్నారు.
బ్యాంక్ అధికారులు హింసించడం వలన రైతు ఆత్మహత్య చేసుకున్నాడని శంకర్ అన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతు కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయినా బాధితరైతులు ఆందోళన కొనసాగించారు. న్యాయపరమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని, రోడ్డుపైనే భీష్ముంచుకొని కూర్చున్నారు.
బ్యాంకు అధికారులతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడారు. బ్యాంక్ అప్పును మాఫీ చేసి, మృతుడి కుటుంబంలో ఒకరికి ఆ బ్యాంకులోనే ఉద్యోగం ఇచ్చేలా అధికారులను ఒప్పించారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించే దిశగా సహకరించాలని, ఆందోళన విరమించాలని కోరారు. సోమవారం రోజు మిగతా పనులన్నీ పూర్తి చేసేలా తాము ముందుండి చేయిస్తామన్నారు. దీంతో రాస్తారోకో విరమించారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా మరో పథకం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

