Banana Bajji Recipe : నోరూరించే అరటికాయ బజ్జీ రెసిపీ.. ఇలా టేస్టీగా చేసుకుంటే అబ్బా అనాల్సిందే
Banana Bajji : సాయంత్రం స్నాక్స్గా ఏమైనా తినాలనుకుంటే అరటికాయ బజ్జీలను ట్రై చేసుకోవచ్చు. ఈ స్టైల్లో చేసుకుని తింటే అబ్బో అనాల్సిందే.. రెసిపీని ఫాలో అయిపోండి.

Tasty Banana Bajji Recipe : సాయంత్రం అయితే ఆకలి వేస్తుందా? బయటకు వెళ్లి ఏమైనా తినే బదులు.. ఇంట్లోనే టేస్టీగా చేసుకోగలిగే అరటికాయ బజ్జీలు చేసుకుంటే హాయిగా ఇంటిల్లిపాది తినొచ్చు. బ్యాచిలర్స్ కూడా వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. నోరూరించే అరటికాయ బజ్జీలు తినాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోవాల్సిందే. మరి వీటిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శనగపిండి - అరకిలో
వామ్ము - 2 చెంచాలు
బియ్యం పిండి - 2 చెంచాలు
ఉప్పు - సరిపడా
సోడా - చిటికెడు
ఉల్లిపాయలు - 1 పెద్దది
కొత్తిమీర - చిన్న కట్ట
పల్లీలు - 100 గ్రాములు
నిమ్మరసం - సగం
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ముందుగా అరటికాయలను బాగా కడిగి కాస్త మందంగా ముక్కలుగా అడ్డంగా కోసుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శనగపిండి, ఉప్పు, వామ్ము, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వాటిలో నీళ్లు వేసి.. ఉండలు లేకుండా బజ్జీలకు కావాల్సినట్టుగా పిండిని కలుపుకోవాలి. దానిలోని వంటసోడా కూడా వేయాలి. దీనిని వేయడం వల్ల బజ్జీలు గుళ్లగా వస్తాయి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. అది కాగిన తర్వాత మంటను మీడియంలో ఉంచి.. అరటికాయ ముక్కలను శనగపిండి మిశ్రమంలో వేసి రెండువైపులా బాగా ముంచి.. దానిని కాగుతున్న నూనెలో వేయాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే చేయాలి.
ఇలా వేయించుకున్న బజ్జీలను నేరుగా తినొచ్చు. కానీ వీటిని రుచిని మరింత పెంచుకునేందుకు.. ఉల్లిపాయలు, కొత్తిమీర తురుమును సిద్ధం చేసుకోవాలి. బజ్జీలు వేయించిన నూనెలోనే పల్లీలు వేసి ఫ్రై చేసుకుని తీసేయాలి. అరటికాయ బజ్జీలను మధ్యలో కోసి.. దానిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, పల్లీలు, ఉప్పు, కారం, కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఇలా చేసిన బజ్జీలను తింటే మీరు ఫిదా అయిపోతారు. సాయంత్రం టీతో పాటు వీటిని కాంబినేషన్గా తీసుకోవచ్చు. వీటిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు.





















