Konaseema Crime News : లేటు వయస్సులో వలపువలకు చిక్కాడు.. చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు
Konaseema District News:లేటు వయస్సులో ఓ వ్యక్తి వలపువలకు చిక్కాడు. బంగారం, డబ్బు కోసం అతనిపై ఓ మహిళ హత్యాయత్నం చేసింది. దీంతో అతను ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు.

Konaseema District News: అతనికి పెళ్లయ్యి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. రేపో మాపో రిటైర్డ్ కూడా కానున్నాడు. అయితే ఓ వివాహితకు అట్రాక్ట్ అయ్యాడు. తీయని మాటలతో కట్టిపడేసింది. లేటు వయస్సులో ఆమె విసిరిన వలపు వలలో చిక్కుకుని బయటకు రాలేకపోయాడు. దీంతో ఆమెతో సహజీవనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతని ఆస్తిపై కన్నేసిన ఆమె ఉన్నదంతా ఊడ్చేయాలని పెద్ద ప్లాన్ వేసింది. కానీ అదీ వర్కవుట్ కాలేదు. కనీసం ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని, అతని దగ్గర తీసుకున్న డబ్బును కొట్టేయాలని చూసింది. దీంతో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది.. రోజూ అమె దగ్గర మద్యం సేవించే అలవాటు ఉండడంతో దానినే మరణాస్త్రంగా మలచుకుని ప్లాన్ అమలు చేసింది. సీన్ కట్‌చేస్తే ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు బాధితుడు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సవరప్పాలెం వాసి సత్తి వెంకటేశ్వరరావు ఓడలరేవు సొసైటీ సీఈవోగా పనిచేస్తున్నాడు. అమలాపురం పట్టణంలో భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమార్తెలిద్దరికి వివాహం చేశాడు. వెంకటేశ్వరరావు ఓ పానీపూరి బండి వద్ద రోజూ ఆగుతూ తినేవాడు. అక్కడే కాకినాడకు చెందిన కుమారి అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి మద్యం కూడా సేవించే క్రమంలో ఈనెల 17వ తేదీ రాత్రి మద్యం సేవిస్తున్న సమయంలో మద్యంలో మత్తుమందు కలిపి ఇచ్చింది.
అది పెద్దగా పనిచేయకపోవడంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నారాయణపేటలో ఉన్న ఇందుపల్లికి చెందిన తుక్కు సుబ్రహ్మణ్యం రూమ్‌కు తీసుకు వెళ్లింది. బండార్లం ప్రాంతానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తికి మరికొంత మత్తుమందు తీసుకురమ్మని కుమారి కోరడంతో ఆ వ్యక్తి గడ్డికి కొట్టే మందును తీసుకొచ్చి ఇచ్చాడు. మద్యంలో గడ్డిమందును కలిపి ఇవ్వడంతో మరింత మత్తులోకి వెళ్లిపోయాడు. దీంతో అతని వంటి మీదనున్న బంగారం, సొసైటీకి చెందిన రూ.లక్ష రూపాయలు కాజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత మెలకువ వచ్చి చూసేసరికి ఎవ్వరూ కనిపించకపోగా సైలెంట్‌గా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే జరిగిన విషయాన్ని ఎవ్వరికైనా చెబుదామంటే 59 ఏళ్లు వయస్సు కావడంతో సిగ్గుతో చెప్పలేకపోయాడు..
క్రమక్రమంగా క్షీణించిన ఆరోగ్యం..
మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావుకు మద్యంతోపాటు గడ్డి మందును కలిపి ఇవ్వడంతో మరుసటి రోజు నుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మార్చి 26 నాటికి పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబికులు అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన వైద్యులు గడ్డిమందు సేవించినట్లు నిర్ధారించారు.
గడ్డి మందు తీసుకోవడంపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు సంగతి చెప్పాడు వెంకటేశ్వరరావు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ప్రస్తుతం కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గడ్డిమందు కావడంతో ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. మొత్తం మీద ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు కుమారితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.





















