World Autism Awareness Day 2025 : ఆటిజంపై అవగాహన దినోత్సవం 2025.. పిల్లల్లోని లక్షణాలు, కారకాలు ఇవే.. చికిత్స ఉందా? లేదా?
Autism Awareness Day :పిల్లల అభివృద్ధిలో ఇబ్బందులను కలిగించే ఆటిజంపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఆటిజం అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దాని లక్షణాలు, కారకాలు చూసేద్దాం.

Autism Causes and Symptoms : ఆటిజంను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని కూడా పిలుస్తారు. ఇది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఇది పుట్టకతోనే వచ్చి.. పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు, పిల్లల అభివృద్ధిలో రుగ్మతలు, కమ్యూనికేషన్, పరస్పర చర్యలు, ప్రవర్తనను ఆటిజం ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు, సంకేతాలను మొదటి మూడు సంవత్సరాలలోనే కనిపించేస్తాయి. ఇవి క్రమంగా అభివృద్ధి చెంది.. పరిస్థితిని దిగజార్చుతాయి.
ఈ ఆటిజంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఆటిజంపై అవగాహన కల్పిస్తూ.. వారికి మద్దతును అందించేలా ప్రోత్సాహించడానికి ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. సమాజంలో ఆటిజం ఉన్నవారు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా బతికే విధంగా సమాజాన్ని మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అసలు ఆటిజం లక్షణాలు ఏంటి? కారకాలున్నాయా? చికిత్స విధానాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటిజం లక్షణాలు..
సామాజిక నియమాలకు అనుగుణంగా ఉండలేరు. భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. కమ్యూనికేషన్ ఉండదు. స్నేహాలు ఏర్పరచుకోవడంలో, సామాజిక సంకేతాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. చేయి ఆడించడం లేదా శరీరాన్ని ఊపడం వంటి కదలికలు ఎక్కువగా ఉంటాయి. రొటీన్పై ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. కాంతి, ధ్వని, స్పర్శ, రుచి లేదా వాసనకు సెన్సిటివ్ అయిపోతారు. ప్రవర్తనలో మార్పులు కూడా ఆటిజం లక్షణాలుగా చెప్పవచ్చు.
ఆటిజంలో రకాలు
ఆటిజం పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. సామాజిక, శారీరక, భాషా నైపుణ్యాల అభివృద్ధిని నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సామాజిక సూచనలను ఆటిజం ఉన్నవారు అర్థం చేసుకోవడానికి ఇబ్బందులు పడతారు. ఆటిజంలో మూడు రకాలు ఉంటాయి. ఆటిజం రుగ్మత, ఆస్పెర్జర్స్ సిండ్రోమ్, పర్వాసివ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్.
ఆటిజం రుగ్మత : దీనిలో భాష, అభిజ్ఞా అభివృద్ధితాలో గణనీయమైన మార్పులు ఉంటాయి. అలాగే పరస్పర చర్యలు, పునరావృత ప్రవర్తనలో ఇబ్బందులు ఉంటాయి.
ఆస్పెర్జర్స్ సిండ్రోమ్ : పరస్పర చర్యలు, పునరావృత ప్రవర్తనలో ఇబ్బందులు ఉంటాయి. కానీ భాష, అభిజ్ఞా అభివృద్ధిలో కాస్త ఇబ్బందులు తక్కువగా ఉంటాయి.
పర్వాసివ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్ (PDD-NOS): కమ్యూనికేషన్ చేయడంలో ఇబ్బందులు పడతారు. కానీ ఆటిస్టిక్ డిజార్డర్ లేదా ఆస్పెర్జర్స్ సిండ్రోమ్ వలె ఎక్కువ ఇబ్బందులు ఉండవు.
ఆటిజంకు కారకాలు..
ఆటిజంకు జన్యుపరమైన కారకాలు ఉంటాయి. కుటుంబ చరిత్ర, జన్యుపరమైనవి ఉంటాయి. పర్యావరణ కారకాలు కూడా ఆటింజకు ప్రమాదకారకాలుగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల వయసు కూడా దీనిపై ప్రభావం చూపిస్తుంది. మెదడు నిర్మాణం, పనితీరులో మార్పులు కూడా దీనికి ప్రమాద కారకాలే.
ఆటిజం చికిత్స
ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతకు చికిత్స లేదు. అందరికీ సరిపోయే చికిత్స ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే లక్షణాలు తగ్గించడం, అభివృద్ధి, అభ్యాసానికి మద్ధతు ఇవ్వడం ద్వారా పనితీరు సామర్థ్యాన్ని చికిత్సలు, థెరపీల ద్వారా మెరుగుపరుస్తారు. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ (ABA), ఆక్యుపేషనల్ థెరపీ (OT), స్పీచ్ థెరపీలు పరిస్థితిని మెరుగుపరుస్తాయి. రోజువారీ దినచర్యను ఏర్పాటు చేయడం, సురక్షితమైన, హెల్తీ వాతావరణాన్ని అందించడం ద్వారా కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















