Nellore Crime News: నెల్లూరు రైళ్లలో సిక్కా గ్యాంగ్ దోపిడీ! పట్టాలపై నాణెం పెట్టి ఎలా దోచుకుంటారంటే?
Nellore Crime News: సిక్కా గ్యాంగ్ పట్టాలపై నాణెం పెట్టి దోపిడీకి పాల్పడుతుంటారు. ఇప్పుడు నెల్లూరులో జరిగిన దోపిడీలో వారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Nellore Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. వెళుతున్న రైలు ఆపి బంగారం, బ్యాగులు దోచుకెళ్లారు దోపిడీ దొంగలు. అల్లూరు రోడ్డు- పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలపై కాయిన్స్ (నాణాలు ) ఉంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ (చండీగర్ - మధురై ) వెళ్లే రైలు ఆపిన దుండగులు, ఆ తరువాత బోగీల్లో ప్రవేశించి మహిళ మెడలో బంగారు చైను, నగదు ఉన్న బ్యాగులు దోచుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు రైల్వే పోలీసుల సమాచారం.
పట్టాలపై నాణెం పెట్టి రైలు ఎలా ఆపుతారంటే?
వేగంగా వెళ్లే ట్రైన్‌ను పట్టాలపై నాణెం పెట్టి ఆపి దొంగతనాలకు పాల్పడిన ఘటనలు చాలానే నమోదవుతున్నాయి. అయితే ఇలా ఒక చిన్న నాణెంతో అంత పెద్ద రైలు ఎలా ఆపుతారనే దానిపై కొంతమంది పోలీసు అధికారులు కొన్ని ఇంటర్వ్యూలో తెలిపారు. పట్టాలపై రైలు వచ్చేటప్పుడు అది ముందుకు వెళ్లాలా అక్కడే ఆగాలా అనేదానిపై సిగ్నల్ ద్వారా డ్రైవర్‌కు సమాచారం అందిస్తుంటారు అధికారులు. అలా వస్తున్న ట్రైన్‌కు సరిగ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టైంలో దోపిడీ దొంగలు పట్టాలపై కాయిన్ పెడతారని ఆ నాణెం వల్ల సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడి గ్రీన్ సిగ్నల్ రెడ్‌గా మారిపోతుందని దానితో డ్రైవర్ ట్రైన్ ఆపేస్తాడని వారు చెప్పారు. ఆ తర్వాత వెంటనే ట్రైన్ లోకి ఎక్కే దొంగలు ప్రయాణికులు వద్ద అందినంత దోచుకుని పరారవుతారు. ఈ టైపు దొంగతనాలకు పాల్పడే వారిని "సిక్కా గ్యాంగ్ " అంటారని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిని ఆణిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పోలీస్ అధికారులు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అలాంటి దొంగతనమే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరగడంపై ఇక్కడ కూడా " సిక్కా గ్యాంగ్‌లు" తిరుగుతున్నాయా అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు.





















