(Source: Poll of Polls)
White Hair: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
చాలా మందికి ఉండే సందేహం ఇది... ఒక్క తెల్లవెంట్రుక లాగేస్తే, దాని చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయని. ఇది ఎంతవరకు నిజం?
ఒకప్పుడు ముసలితనానికి చిహ్నంగా ఉండేవి తెల్లవెంట్రుకలు. ఇప్పుడు కాలం మారింది చిన్నవయసు నుంచే తెల్లవెంట్రుకలు కనిపిస్తున్నాయి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు... కానీ ప్రజల మనసులో ఓ నమ్మకం మాత్రం నాటుకుపోయింది... ఒక్క తెల్లవెంట్రుకను పీకేస్తే, ఆ వెంట్రుక చుట్టుపక్కల ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయనుకుంటారు. కానీ అది ఒక్కశాతం కూడా నిజం కాదని చెబుతున్నారు వైద్యులు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు.
ముఖ్యపాత్ర మెలనిన్‌దే
తెల్లవెంట్రుకలకు, నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయించేది మెలనిన్ అనే వర్ణద్రవ్యం. తెల్లవెంట్రుకలలో మెలనిన్ ఉండదు. అదే నల్లవెంట్రుకలలో మెలనిన్ నిండిపోయి ఉంటుంది. గోధుమరంగు వెంట్రుకల్లో మెలనిన్ ఓ యాభైశాతం వరకు ఉంటుంది. వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల (ఫోలిసిల్స్) నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడే మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన మెలనిన్, వెంట్రుక గొట్టాల్లోకి చొచ్చుకునివెళ్లి పేరుకుపోతుంది. అందుకే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అయితే కొన్ని వెంట్రుకల కుదుళ్ల వద్ద మెలనిన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఆ వెంట్రుకలు గోధుమరంగులో లేదా తెల్లగా మారిపోతుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మెలనిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముసలితనంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి.
నిజం కాదు
తెల్లవెంట్రుకలను పీకేస్తే పక్కనున్న వెంట్రుకలు తెల్లగా మారతాయనడం మాత్రం పూర్తిగా అబద్ధం అని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. మెలనిన్ సరిగా ఉత్పత్తి కాని వెంట్రుకలు మాత్రమే తెల్లగా మారుతాయని అంటున్నారు. అయితే తలపై ఒకేప్రాంతంలో వెంట్రుకలు గుంపులుగా తెల్లగా మారడం వల్ల ఆ అభిప్రాయం పెరిగిఉండొచ్చు. కానీ ఆ ప్రాంతంలో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల అక్కడున్న వెంట్రుకలన్నీ తెల్లగా మారిపోతాయి. అంతే తప్ప ఒక తెల్లవెంట్రుక పీకితే మిగతావి మారతాయనుకోవడం పూర్తిగా అపోహ.
పాశ్చాత్యుల జుట్టెందుకు తెలుపు?
మెలనిన్ రేణువులు సాధారణ కాంతితో పాటూ సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను కూడా శోషించుకుని మరింత నల్లగా మారతాయి. చాలా పాశ్చాత్య దేశాల్లో సౌరకాంతి తక్కువగా ఉంటుంది. అందుకే వారి జుట్టు తెల్లగా, గోధుమ రంగులో, తెలుపు నలుపుల మిక్స్ గా కనిపిస్తుంది. దానికి తక్కువ మెలనిన్ ఉత్పత్తే కారణం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు