KL University: కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు, లంచం కేసులో 10 మంది అరెస్ట్!
గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై లంచం ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా 10 మందిని అదుపులోకి తీసుకుంది.

KL University bribe for NAAC rating | లంచం ఆరోపణలతో గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) రేటింగ్స్ కోసం ఇన్‌స్పెక్షన్ కమిటీకి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు ఇన్‌స్పెక్షన్ టీంపై సైతం కేసు నమోదు చేసింది. ఓవరాల్‌గా 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, 10 మందిని అరెస్టు చేశారు.
దేశ వ్యాప్తంగా సీబీఐ తనిఖీలు
అరెస్టయినవారిలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ (KL University) ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, యూనివర్సిటీ హైదరాబాద్ (Hyderabad) క్యాంపస్ డైరెక్టర్ ఏ. రామకృష్ణతో పాటు NAAC ఇన్‌స్పెక్షన్ టీం ఛైర్మన్ సమరేంద్రనాథ్ సాహా సహా వీరి టీంలో ఏడుగుర్ని సీబీఐ అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి 6 ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్, ట్రాలీ బ్యాగ్, రూ. 37 లక్షల నగదు, బంగారు నాణెం స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థలపై సీబీఐ దాడులు చేసింది. తనిఖీలలో భాగంగా అధికారులు పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
రేటింగ్ కోసం లంచం ఇచ్చారని కేసు నమోదు
A++ అక్రిడిటేషన్ కోసం NAAC రేటింగ్ ఇచ్చేందుకు తనిఖీ బృందానికి గుంటూరు (ఆంధ్రప్రదేశ్) కేఎల్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ లంచం అంశంపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, NAAC మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథ రావు, NAAC అడ్వైజర్ ఎంఎస్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. హనుమంతప్పలను నిందితుల జాబితాలో చేర్చింది సీబీఐ. కేసు విచారణ చేపట్టిన సీబీఐ టీమ్ ఈ నలుగురు మినహా కేసు నమోదైన మిగతా 10 మందిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీ, సంభల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలం సహా పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది.
ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన నిందితుల పేర్లు
1. కోనేరు సత్యనారాయణ, అధ్యక్షుడు, KL University
2. G. P. సారధి వర్మ, వైస్ ఛాన్సలర్, KL University
3. కోనేరు రాజా హరీన్, వైస్ ప్రెసిడెంట్, KL University
4. ఎ. రామకృష్ణ, డైరెక్టర్, కెఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్ క్యాంపస్
5. డాక్టర్ ఎల్. మంజునాథ రావు, NAAC మాజీ డిప్యూటీ అడ్వైజర్
6. M. హనుమంతప్ప, ప్రొఫెసర్ & డైరెక్టర్ (IQAC- NAAC), కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ విభాగం, బెంగళూరు యూనివర్సిటీ
7. M. S. శ్యాంసుందర్, NAAC బెంగళూరు సలహాదారు
8. సమరేంద్ర నాథ్ సాహా, రామచంద్ర చంద్రవంశీ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, న్యాక్ ఇన్‌స్పెక్షన్ కమిటీ ఛైర్మన్
9. రాజీవ్ సిజారియా, ప్రొఫెసర్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), ఢిల్లీ, సభ్యుడు కో-ఆర్డినేటర్, NAAC తనిఖీ కమిటీ
10. డా. డి. గోపాల్, డీన్, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, సభ్యుడు, NAAC తనిఖీ కమిటీ
11. రాజేష్ సింగ్ పవార్, డీన్, జాగ్రన్ లేక్సిటీ యూనివర్శిటీ, భోపాల్ సభ్యుడు, NAAC తనిఖీ కమిటీ
12. మానస్ కుమార్ మిశ్రా, డైరెక్టర్, GL బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, సభ్యుడు, NAAC తనిఖీ కమిటీ
13. గాయత్రి దేవరాజా, ప్రొఫెసర్, దావణగెరె యూనివర్సిటీ, సభ్యులు, NAAC తనిఖీ కమిటీ
14. డాక్టర్ బులు మహారాణా, ప్రొఫెసర్, సంబల్పూర్ యూనివర్సిటీ, సభ్యుడు, NAAC తనిఖీ కమిటీ
Also Read: Budget 2025: కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ల వల్ల సామాన్యుడికి ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుసా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

