Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP Desam
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండో సారి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకునేలా బడ్జెట్ లో అనేక విశేషాలు ఉన్నాయి ఈసారి బడ్జెట్ లో. మరి వాటిలో టాప్ 5 విశేషాలు ఈ వీడియోలో చూద్దాం.
1.
12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు
ఈసారి బడ్జెట్ లో ప్రధానమైన కీలకమైన అంశం ఇదే. 12లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ఇది మధ్యతరగతి ఉద్యోగులకు భారీ తాయిలమనే చెప్పాలి. ఈ ఏడాది వరకూ 7లక్షల రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే దాన్ని దాదాపుగా డబుల్ చేస్తూ 12 లక్షల మినహాయింపు ఇవ్వటం ఎవ్వరూ ఊహించనది. స్టాండర్డ్ డిడక్షన్ 75వేల రూపాయలు ప్రకటించగా...కొత్త ప్రకటనతో 12 లక్షల 75వేల రూపాయల వరకూ ఆదాయం కలిగిన వారు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు.
2.
MSME లకు బడ్జెట్ లో వరాలు
సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బడ్జెట్ లో వరాల జల్లు కురిపించింది. MSMEలు ఏర్పాటు చేసుకోవటానికి కేంద్రం ఇచ్చే రుణాలను రూ.5కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెంచింది కేంద్రం. MSME లు ఏర్పాటు చేసుకునే వాళ్లకు చేయూతనిచ్చేలా ఈ నిర్ణయాన్ని బడ్జెట్ లో ప్రకటించారు.
3. స్టార్టప్ లకు బడ్జెట్ ఊతం
ఇప్పటివరకూ అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్ లు పెట్టుకుందాం అనుకునే వాళ్లు సరైన పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లు. కానీ ఈసారి బడ్జెట్ లో స్టార్టప్ లపై కేంద్రం బాగా దృష్టి పెట్టింది. మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటే చాలు కేంద్రం మీకు 20కోట్ల రూపాయల వరకూ రుణాలు ఇవ్వనుంది. ఇంతకు ముందు వరకూ 10కోట్ల రూపాయల వరకూ ఉండేది.
4. క్రెడిట్ కార్డుల జాతర
మీకు ఇన్నాళ్లూ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి క్రెడిట్ కార్డ్ కావాలా అనే ఫోన్స్ తెగ వచ్చేవి కదా. ఇకపై ప్రభుత్వం నుంచి కూడా వస్తాయి. ఫన్నీగానే చెప్పాను కానీ ప్రభుత్వం పట్టణ పేదలకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వార్షిక బడ్జెట్ లో ప్రకటన చేశారు. 30వేల రూపాయల లిమిట్ తో పట్టణ పేదలకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను ఇస్తామని ప్రకటించారు బడ్జెట్ లో. రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ ను పెంచారు. ఇంతకు ముందు వరకూ రూ.3 లక్షల రూపాయలుగా ఉన్న రుణాల పరిమితిని 5లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్ లో ప్రకటన చేసింది.
5. అణు శక్తి భారత్
ఈసారి బడ్జెట్ లో భారత్ అణుశక్తి మీద బాగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. బడ్జెట్ లో కీలక కేటాయింపులు ఉన్నాయి అణుశక్తి మీద. రూ.20 వేల కోట్ల రూపాయలతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. 2030 నాటికి నాలుగు చిన్న, మధ్య తరహా స్థాయి అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం...2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భావిస్తున్నామని చెప్పింది.





















