Ashta Aishwaryam: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
ఎవరినైనా దీవించేటప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని ఆశీర్వదిస్తాం. ముఖ్యంగా పిల్లలను దీవించేప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తాం
ఎప్పుడైనా ఆలోచించారా అష్ట ఐశ్వర్యాలు అంటే ఏమిటో? ఐశ్వర్యం అంటే సంపద అని తెలుసు అందరికీ, మరి అష్ట ఐశ్వర్యాలు అంటే? ఏఏ సంపదలను కలిపి అష్టైశ్వర్యాలుగా పరిగణిస్తారు? ఇప్పుడు ఈ విషయమే తెలుసుకోబోతున్నాం. ఐశ్వర్యవంతులంటే ఏ విషయంలోనూ వారికీ ఏ లోటు ఉండదని అర్థం. పూర్వం రాజుల కాలంలో అష్టైశ్వర్యాలుగా ఎనిమిది రకాల సంపదల్ని చెప్పుకునే వారు. అవేంటంటే...
1. దాసీ జనము
ఇప్పటి వాడుకలో పనివాళ్లుగా చెప్పుకోవచ్చు. వంట చేయడానికి ఒకరు, బట్టలు ఉతికేందుకు ఒకరు, ధనవంతుల బిడ్డల్ని ఆడించేందుకు ఒకరు... ఇలా ఎంతో మంది పరిచారికలు ఉండడానని అప్పట్లో సంపదగా భావించేవారు. ఇప్పుడు కూడా కోటీశ్వరుల ఇళ్లల్లో ఎక్కువమంది పనివాళ్లు కనిపిస్తుంటారు.
2. భృత్యులు
వీరిని శిష్యులుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ వెంట ఉంటూ గురువులా పూజించే వారన్నమాట. చెప్పిన పనులు చేస్తూ, చాలా గౌరవాన్ని ఇచ్చే శిష్యగణం.
3. పుత్రులు
పూర్వం పుత్రసంతానికి ఎక్కువ విలువ ఉండేది. రాజ్యానికి రాజుగా పుత్రసంతానాన్నే పరిగణించేవారు. అందుకే అష్టైశ్వర్యాల్లో పుత్రసంతానం కూడా ఒక సంపదగా చూసేవారు.
4. మిత్రులు
ఎంత సంపద ఉన్నా మంచి మిత్రులు లేని జీవితం వ్యర్థమే. అందుకే స్నేహితులు అధికంగా ఉండటాన్ని కూడా సంపదగా పరిగణించేవారు.
5. బంధువులు
అన్న, చెల్లి, అత్త, మామ, చిన్నాన్న, పిన్ని, పెద్దమ్మ... ఇలా అనేక బంధుత్వాలు ఉంటాయి. ఆ బంధుత్వాలన్నింటినీ తన జీవితంలో కలిగి ఉన్న వ్యక్తిని ఐశ్వర్యవంతుడిగా భావిస్తారు.
6. వాహనములు
పూర్వం కాలంలో అయితే బగ్గీలు, గుర్రాలు, రథాలు వంటి ప్రయాణానికి పనికివచ్చేవి ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు కార్లు, బైకులు ఉండడాన్ని కూడా ఒక ఐశ్వర్యంగా భావిస్తున్నారు.
7. ధనము
అన్నింటి కన్నా ముఖ్యమైన సంపద ఇది. ధనంతోనే మిగతావన్నీ సాధ్యమవుతాయి. రాజుల కాలంలో పెట్టెలకొద్దీ బంగారునాణాలు ఇళ్లల్లో ఉండేవి. ఇప్పుడు లాకర్లలో కట్టకట్టలు నోట్లు దాచిపెట్టుకుంటున్నారు.
8. ధాన్యము
వస్తుసంపద, ఆహారం ఈ కోవలోకి వస్తుంది. రుచికరమైన ఆహారం తినే యోగం, ఇంట్లో సౌఖ్యాన్ని అందించే వస్తువులు ఉంటే వాళ్లని కూడా ఐశ్వర్యవంతులు అని అంటారు.
పైన చెప్పిన అష్టైశ్వర్యాలన్నీ రాజుల కాలం నాటి పరిస్థితులను బట్టి నిర్ణయించినవి.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు