Signs of Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...
ప్రజల్లో సరైన ఆహారం తినకుండా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. కనీసం వారికి తమకు ఆ లోపం ఉన్నట్టు కూడా తెలియదు.
శరీరంలోని ప్రతి పని సక్రమంగా జరగాలంటే అత్యవసరాలైన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అవసరం. వాటిలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఇనుము. ఇది ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్ అందించడంతో సహాయపడుతుంది. అలాగే శరీరం ఎదుగుదలను, పనితీరును నిర్ధారిస్తుంది. అంతేకాదు శరీరంలో తగినంత రక్తం ఉత్పత్తి కావడానికి కూడా ఇనుము అవసరం. ప్రపంచఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 42 శాతం మంది, గర్భిణీ స్త్రీలలో 40 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తమకు ఐరన్ లోపం ఉన్నట్టు చాలా మంది గుర్తించలేకపోవడమే రక్తహీనతకు దారి తీస్తోందని అభిప్రాయపడుతున్నారు ఆరోగ్యనిపుణులు.
ఐరన్ లోపం ఉంటే లక్షణాలు ఇలా ఉంటాయి
1. ఐరన్ లోపంతో బాధపడే వ్యక్తికి నిత్యం నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఐరన్ హిమోగ్లోబిన్ తయారుకావడానికి సహాయపడే ఖనిజం. ఇనుము తగ్గితే హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. అంటే కణజాలాలకు, కండరాలకు రక్తం ద్వారా తక్కువ ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల శక్తి కోల్పోయినట్టు అవుతుంది.
2. శ్వాస సరిగా ఆడినట్టు అనిపించదు. శ్వాసరేటు కూడా పెరుగుతుంది. నడవడం, మెట్లు ఎక్కడం, వ్యాయామం వంటి సాధారణమైన పనులు చేసినా అలసటగా అనిపిస్తుంది.
3. గుండె రేటు కూడా పెరుగుతుంది. ఇనుము తగ్గడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె కొట్టుకునే రేటు సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
4. తలనొప్పి, డిజీనెస్ కలుగుతాయి. ఇనుము లోపం వల్ల బ్రెయిన్ కు ఆక్సిజన్ సరిగా అందక తలనొప్పి మొదలవుతుంది. ఐరన్ లోపానికి, తలనొప్పికి సంబంధం ఉందని చాలా మందికి తెలియదు.
5. చర్మం పాలిపోయినట్టు మారుతుంది. ఎర్రరక్తకణాల వల్లే రక్తానికి ఆ ఎరుపు రంగు వస్తుంది. ఎప్పుడైతే ఇనుము శాతం తగ్గిందో ఎర్రరక్తకణాల సంఖ్య, రక్తం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీని వల్ల చర్మం తన సహజమైన రంగును కోల్పోయి పాలిపోయినట్టు మారుతుంది.
6. ఇనుము లోపాన్ని నాలుక, నోరు కూడా కొన్ని సూచనల ద్వారా తెలుపుతాయి. నోరు తరచూ తడారిపోవడం, మంటగా అనిపించడం, నోటి మూలల్లో పగుళ్లు, నోటిలో అల్సర్లు రావడం వంటివి అవుతాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి
Also read: రోజుకో గ్లాసు గంజినీళ్లతో మెరిసే అందమే కాదు, చక్కటి ఆరోగ్యమూ సొంతమవుతుంది
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు