Rice water: రోజుకో గ్లాసు గంజినీళ్లతో మెరిసే అందమే కాదు, చక్కటి ఆరోగ్యమూ సొంతమవుతుంది
గంజినీళ్లంటే చాలా మంది మరిచిపోయిఉంటారు. ఎందుకంటే ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కుక్కర్లేగా. కానీ గంజి నీళ్ల విలువ తెలుసుకుంటే కుక్కర్లు పక్కన పడేయడం ఖాయం.
పూర్వం రోజుల్లో గంజి నీళ్లకు చాలా విలువుండేది. వాటిని వృధాగా పడేసేవారు కాదు. రోజూ ఉదయానే తాగేవారు. బియ్యం బాగా ఉడికాక మిగిలిన నీటిని వేరేగిన్నెలో ఒంపేవారు. అదే గంజినీరు. ఇప్పుడు పల్లెటూళ్లలో తప్ప ఎక్కడా గంజినీళ్లు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో అన్నం వండడం అలవాటైంది. అందులో గంజి రాదు. కానీ గంజి నీళ్ల విలువ తెలిస్తే... ఇంట్లో కుక్కర్లు వాడడం మానేసి మరీ గంజినీళ్లు వచ్చే అన్నం వండుతారు. అందుకే వాటి ప్రయోజనాలేంటో తెలుసుకోండి మరి.
మెరిసే జుట్టు కోసం
అమెరికాకు చెందిన క్లీవ్ ల్యాండ్ క్లినిక్ అధ్యయనం ప్రకారం గంజిలో ఇనోసిటాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేసేది. అంతేకాదు గంజిలో మెగ్నీషియం, జింక్, విటమిన్ బి, ఇ, కూడా ఉంటాయి. ఇవన్నీ జుట్టును మెరిసేలా చేయడంతో పాటూ ఆరోగ్యంగా, పొడవుగా ఎదిగేందుకు సహకరిస్తాయి.
జీర్ణక్రియ మెరుగుదలకు
గంజిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగుల్లో ఆహారం సులువుగా కదిలేందుకు సహకరిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి రోజూ ఓ గ్లాసు గంజి తాగితే మంచిది.
ఎనర్జీ బూస్టర్
చాలా మంది నిత్యం నీరసంగా ఫీలవుతుంటారు. తిన్నా, తినకపోయినా వారికి అలసటగానే అనిపిస్తుంది. అలాంటివారికి గంజి మంచి పరిష్కారం. రోజూ గ్లాసు గంజి తాగడం అలవాటు చేసుకుంటే అలసట, నీరసం వంటి సమస్యలు కొన్ని రోజుల్లోనే మాయమవుతాయి. ముఖ్యంగా ఉదయాన్నే గంజి నీళ్లు తాగితే మరీ మంచిది.
యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు
గంజి నీళ్లలో అమినో యాసిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కలిగిస్తాయి. దీనివల్ల చర్మం సహజమెరుపును పొందడమే కాదు ముఖంపై ముడతలు, గీతలు, మచ్చల్లాంటివి రాకుండా అడ్డుకుంటాయి.
చర్మాన్ని హైడ్రేషన్
మన శరీరం ఎప్పుడూ తేమవంతంగా ఉండాలి. అందుకే ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోమని చెబుతారు వైద్యులు. గంజినీళ్లలో శరీరానికి అవసరమయ్యే ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. అవి పోషకాలను కోల్పోకుండా, శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. అతిసారం వ్యాధిగ్రస్తులకు గంజినీళ్లు చాలా మేలు చేస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి