Baby John Collection Day 1 vs Pushpa 2: 'బేబీ జాన్' వర్సెస్ 'పుష్ప 2'... వరుణ్ ధావన్ మూవీ ఓపెనింగ్ డే కంటే అల్లు అర్జున్ సినిమా 21 రోజు డబుల్ కలెక్షన్స్
Pushpa 2 vs Baby John: క్రిస్మస్ రోజు కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీసును మడతబెట్టేసింది 'పుష్ప 2'. అల్లు అర్జున్ మూవీ డిసెంబర్ 25 న విడుదలైన 'బేబీ జాన్' ఫస్ట్ డే కలెక్షన్ల కంటే ఎక్కువే రాబట్టింది.
హిందీలో 'పుష్ప 2' కలెక్షన్ల ప్రభంజనం ఆగట్లేదు. పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఈవారం క్రిస్మస్ కానుకగా పలు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో, 'పుష్ప 2'కు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ పుష్పరాజ్ ఏకంగా ఆయా సినిమాల ఓపెనింగ్ కూడా దాటేసి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రిస్మస్ సందర్భంగా హిందీలో రిలీజైన 'బేబీ జాన్' మూవీ 'పుష్ప 2'తో పోల్చుకుంటే వెనకబడిపోయింది.
'బేబీ జాన్'ను వెనక్కి నెట్టేసిన 'పుష్ప 2'
అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. డిసెంబర్ 5 న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సందడి థియేటర్లలో ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా హిందీలో పుష్పరాజ్ జాతర నడుస్తోంది. 'పుష్ప 2' హిందీ వెర్షన్ ఇప్పటికే భారతదేశంలో ఆల్-టైమ్ హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ YRF కూడా 'పుష్ప 2' బృందాన్ని కొత్త సృష్టించినందుకు, కొత్త రికార్డులను నెలకొల్పినందుకు అభినందించింది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఇప్పటికీ భారీ వసూళ్లను రాబడుతుండడం విశేషం.
క్రిస్మస్ పండుగ రోజున 'పుష్ప 2' హిందీ వెర్షన్ కు కొత్త చిత్రం "బేబీ జాన్" పోటీగా వచ్చింది. అయినప్పటికీ భారతదేశంలో సుమారు రూ. 19.5 కోట్లు (నెట్) వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. మరోవైపు వరుణ్ ధావన్ కీర్తి సురేష్ నటించిన 'బేబీ జాన్' ఫస్ట్ డే కేవలం రూ 10 కోట్లు (నెట్) వసూలు చేసింది. క్రిస్మస్ పండుగ రోజున 'బేబీ జాన్' కంటే 'పుష్ప 2' డబుల్ కలెక్షన్స్ ను రాబట్టి, పుష్ప రాజ్ సత్తా ఏంటో నిరూపించింది. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ రన్ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ముగిసిందనే చెప్పాలి. కానీ హిందీ వెర్షన్ భారతదేశంలో రూ. 800 కోట్ల నెట్ వసూళ్లను దాటే అవకాశం ఉంది.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
వివాదం ఉన్నా తగ్గేదే లే
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్, తాజాగా బన్నీని విచారించిన పోలీసుల ఎపిసోడ్ గురించే చర్చ నడుస్తోంది. నేషనల్ మీడియా అయితే డిబేట్ల మీద డిబేట్లు పెట్టి వివాదంపై చర్చలు జరుపుతోంది. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు జరపబోయే చర్చల తరువాత ఈ వివాదం చల్లబడే ఛాన్స్ ఉంది. ఓవైపు 'పుష్ప 2' ప్రీమియర్లలో జరిగిన విషాద ఘటన ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తుంటే, మరోవైపు 'పుష్ప 2' ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా కలెక్షన్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2' కలెక్షన్ల పరిస్థితి పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అన్నట్టుగా ఉంది. ఈ వివాదం ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై ఏమాత్రం పడట్లేదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 'పుష్ప 2' మేనియా మూవీ లవర్స్ ను ఊపేస్తోంది.