Baby John Review - బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
Baby John Movie Review: వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'బేబీ జాన్'తో కీర్తి సురేష్ హిందీ చిత్రసీమకి పరిచయమయ్యారు. విజయ్ తెరికి రీమేక్ అయిన ఈ మూవీ ఎలా ఉంది? అనేది చూస్తే...
కలీస్
'బేబీ జాన్'లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి, రాజ్ పాల్ యాదవ్ తదితరులతో పాటు అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
Varun Dhawan and Keerthy Suresh's Baby John Review in Telugu: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా సినిమా బేబీ జాన్. ఇందులో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేశారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వామికా గబ్బి మరొక హీరోయిన్. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన తమిళ సినిమా తెరికీ హిందీ రీమేక్ ఇది. షారుఖ్ ఖాన్ జవాన్ తర్వాత హిందీలో దర్శకుడు అట్లీకి పాపులారిటీ వచ్చింది. దాంతో ఆయన సమర్పణలో ఆయన భార్య నిర్మాతగా, కలేష్ దర్శకుడిగా సినిమా చేశారు. ఈ రీమేక్ ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Babu John Story): జాన్ డిసిల్వ (వరుణ్ ధావన్) సింగిల్ పేరెంట్. అతనికి ఓ కుమార్తె ఖుషి (బేబీ జారా జ్యాన్న). ఉదయాన్నే పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత బేకరీలో పనులు చూసుకుంటాడు. జాన్ మరీ పిరికి. ఎదుటి వ్యక్తిని పల్లెత్తు మాట అనడు. కనీసం కోప్పడటం కూడా రాదు.
ముంబైలో రౌడీ మూకల భరతం పట్టిన ఐపీఎస్ ఆఫీసర్ సత్య పేరు మార్చుకుని కేరళలో జాన్ గా ఎందుకు సెటిల్ అయ్యాడు? నానాజీ (జాకీ ష్రాఫ్)కి, సత్యకి మధ్య ఎందుకు యుద్ధం జరిగింది? సత్య భార్య మీరా (కీర్తి సురేష్)కి ఏమైంది? సిటీలో అమ్మాయిల మిస్సింగ్ కేసులకు, నానాజీకి సంబంధం ఏమిటి? సత్య మళ్ళీ డ్యూటీలోకి వచ్చి ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కథలో ఏజెంట్ భాయ్ జాన్ (సల్మాన్ ఖాన్) ఏం చేశాడు? అనేది ఎండింగ్ ట్విస్ట్.
విశ్లేషణ (Baby John Review Telugu): రీమేక్ అంటే చిత్రసీమలో ప్రముఖులతో పాటు మూవీ లవర్స్, కొంత మంది ప్రేక్షకులు గమనించే మొదటి విషయం మార్పులు - చేర్పులు ఏం చేశారని!? 'బేబీ జాన్' విడుదలకు ముందు మార్పులు చేశామని హీరో వరుణ్ ధావన్ కూడా చెప్పారు. సినిమా చూస్తే... ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ వరకు, అతిథి పాత్రను యాడ్ చేయడం తప్ప పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు.
దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో 'పోలీస్'గా విడుదలైంది) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనిమిదేళ్లు. అప్పటికి, ఇప్పటికి ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దర్శక రచయితలు సైతం కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, 'బేబీ జాన్' దర్శకుడు కలీస్ సేఫ్ గేమ్ ఆడారు. విజయ్ 'తెరి'ని చాలా వరకు మక్కీకి మక్కీగా కాపీ పేస్ట్ అన్నట్టు దించేశారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్... కెమెరా యాంగిల్స్‌తో సహా. లవ్ స్టోరీ - హీరోయిన్ & హీరో మదర్ సీన్స్ - కనీసం కొన్ని డైలాగులు కూడా మార్చలేదు. కొత్తగా రాసే ప్రయత్నం చేయలేదు. అందువల్ల సౌత్ ఆడియన్స్ కొత్తగా ఫీలయ్యే అంశాలు ఏవీ సినిమాలో లేవు.
'తెరి'ని పక్కన పెట్టి 'బేబీ జాన్' ఎలా ఉంది? అనే విషయానికి వస్తే... లవ్, యాక్షన్, కామెడీ వంటి మాస్, కమర్షియల్ అంశాలు ఉన్న మసాలా సినిమా. కేరళ నేపథ్యం, ముంబై టచ్ ఇవ్వడం వల్ల నార్త్ ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ అవుట్ డేటెడ్ కమర్షియల్ సినిమాను తలపించాయి. సో కాల్డ్ కమర్షియల్ సినిమా అయితే చాలు, థియేటర్లకు వెళ్లే మూవీ లవర్స్‌ను మాత్రమే 'బేబీ జాన్' మెప్పించవచ్చు. తమన్ సంగీతం అయితే నచ్చుతుంది. బాలీవుడ్ మ్యూజిక్ స్టైల్ ఫాలో కాకుండా తన ఓన్ స్టైల్‌లో రీ రికార్డింగ్ చేశారు తమన్. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆడియన్స్‌కు 'హై' ఇచ్చేలా ఆయన ఆర్ఆర్ సాగింది. నార్త్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్, రూబెన్ ఎడిటింగ్ కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
Also Read: బరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?
బేకరీ మ్యాన్ జాన్ డిసిల్వ, ఐపీఎస్ ఆఫీసర్ సత్య... రెండు షేడ్స్ ఉన్న రోల్ చేశారు వరుణ్ ధావన్. రెండు షేడ్స్ మధ్య డిఫరెన్స్ చూపించారు. లాంగ్ హెయిర్, లుంగీలో కంటే ఖాకీ చొక్కాలో ఆయన ఎక్కువ కంఫర్టబుల్‌గా కనిపించారు. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. తన క్యారెక్టర్ వరకు బాగా చేశారు. కీర్తి సురేష్ మలయాళీ అమ్మాయిగా నటించారు. హుందాగా, పద్ధతిగా పాత్రకు తగ్గట్టు కనిపించారు. ఒక్క పాటలో గ్లామర్ డ్రస్సులు వేశారు. వామికా గబ్బి స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంత సేపూ ఆవిడ ప్రజెన్స్ బావుంది. కామెడీ కాకుండా సీరియస్ ఉన్న సన్నివేశాల్లో రాజ్ పాల్ యాదవ్ అదరగొట్టారు.
'బేబీ జాన్'లోని ఆర్టిస్టులు అందరిలో ఎక్కువ మార్కులు కొట్టేసేది జాకీ ష్రాఫ్. నానాజీ పాత్రలో ఆయన చూపిన విలనిజం బావుంది. సల్మాన్ ఖాన్ చివరలో కాసేపు సందడి చేసినా... మాస్ ఆడియన్స్ అందరికీ 'హై' ఇచ్చేలా ఆ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశారు. హీరో కుమార్తెగా నటించిన ఖుషి బాగా చేసింది.
బేబీ జాన్... బాలీవుడ్ ఆడియన్స్ వరకు కొత్త. సౌత్ ఆడియన్స్‌కు అయితే కాదు. ఈ తరహా సినిమాలు చూసేశారు. అందులోనూ 'తెరి' రీమేక్ కనుక తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టం. బాగా డిజప్పాయింట్ చేస్తుంది. బాలీవుడ్ ఆడియన్స్ పరంగా చూసినా... యాక్షన్ సీక్వెన్సులు, తమన్ మ్యూజిక్ మెప్పిస్తాయి. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు కోరుకునే నార్త్ జనాలకూ సారీ జాన్... సారీ, ఈ 'బేబీ జాన్'.
'తెరి' హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. వరుణ్ ధావన్ (Varun Dhawan Baby John Review)తో ఆ కథను రీమేక్ చేస్తే... థియేటర్లకు ఆడియన్స్ వస్తారా? నార్త్ ఇండియాలో అతడిని అంత స్టార్‌డమ్ ఉందా? అనేది దర్శక నిర్మాతలు ముందుగా ఆలోచించలేదు అనుకుంట! తమిళంలో 'తెరి', హిందీలో 'జవాన్' విజయాల వెనుక దళపతి విజయ్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. వాళ్ళ ఇమేజ్, స్టార్‌డమ్ సినిమాలకు హెల్ప్ అయ్యాయి. ఆ లాజిక్ అట్లీ ఎలా మిస్ అయ్యారో మరి? హిందీలో హిట్ కోసం కీర్తి సురేష్ మరో సినిమా చేయాలి.
Also Read: 'రైఫిల్ క్లబ్' రివ్యూ: వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటించిన మలయాళ సినిమా... ఎందుకంత స్పెషల్?