Concussion Controversy: రిఫరీ శ్రీనాథ్ మెడకు చుట్టుకుంటున్న వివాదం.. ఇంగ్లాండ్ దిగ్గజ రిఫరీ తీవ్ర విమర్శలు
దూబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా రాణాను తీసుకురావడం వివాదస్పదమైంది. కంకషన్ సబ్ స్టిట్యూట్ గా లైక్ టు టైక్ ప్లేయర్ రావాల్సి ఉంది. అంటే బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాటర్ స్థానంలో బ్యాటర్ రావాలి.

Ind Vs Eng T20i Updates: పుణేలో జరిగిన నాలుగో టీ20లో మొదలైన కంకషన్ సబ్స్టిట్యూట్ వివాదం భారత మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ మెడకు చుట్టుకునేట్లు కనిపిస్తోంది. ఆ మ్యాచ్ లో తొలుత భారత్ బ్యాటింగ్ చేయగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి దూబే హెల్మెట్ కి బంతి తాకింది. ఆ తర్వాత ఫీల్డింగ్ కి దూబే రాలేదు. అతని స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా పేసర్ హర్షిత్ రాణాను తీసుకురావడం వివాదస్పదమైంది. నిజానికి కంకషన్ సబ్ స్టిట్యూట్ గా లైక్ టు టైక్ ప్లేయర్ రావాల్సి ఉంది. అంటే బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాటర్ స్థానంలో బ్యాటర్ అలాగన్నమాట. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన దూబే స్థానంలో స్పెషలిస్టు పేసర్ రాణాను తీసుకురావడంపై క్రికెట్ ప్రపంచంలో అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ఇంగ్లాండ్ మాజీలు, భారత మాజీలు, మరికొంతమంది కూడా సరికాదని వాదించారు. తాజాగా దీనిపై ప్రముఖ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ కూడా అభ్యంతరం తెలిపాడు.
Do you agree with KP? 🤔
— ESPNcricinfo (@ESPNcricinfo) January 31, 2025
Full story: https://t.co/dd3cDrbpPl pic.twitter.com/Enoq46q1HQ
అపార అనుభవం..
అంతర్జాతీయ క్రికెట్లో బ్రాడ్ కు మ్యాచ్ రిఫరీగా అపార అనుభవం ఉంది. రంజన్ మదుగల్లె (798 మ్యాచ్ లు), జెఫ్ క్రో (656) తర్వాత అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు రిఫరీగా పని చేసిన అనుభవం ఉంది. తను ఇప్పటివరకు 622 మ్యాచ్ లకు రిఫరీగా పని చేశాడు. పుణే మ్యాచ్ ద్వారా ఐసీసీ తిరిగి పాత రోజుల్లోకి వెళుతోందని, అవి పక్షపాతం, అవినీతితో కూడుకుని ఉన్నవని వ్యాఖ్యానించాడు. అలాగే దూబేకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాణా లైక్ టూ లైక్ రీప్లేస్ మెంట్ కాబోడని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ ల్లో తటస్థ రిఫరీలను ఉంచాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నడు. అప్పుడే ఇలాంటి నిర్ణయాలకు చెల్లు చీటి పడుతుందని వ్యాఖ్యానించాడు. నిజానికి టెస్టుల విషయానికొస్తే తటస్థ అంపైర్లను వాడుతున్నారు. అయితే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్ ల్లో మాత్రం ఆయా దేశాలకు చెందిన అంపైర్లనే వాడుతున్నారు. ఇప్పుడు అన్ని మ్యాచ్ లకు రిఫరీలను కూడా తటస్థులనే ఎంపిక చేయాలని బ్రాడ్ పేర్కొంటున్నాడు.
ఇండియాకు ఆ అవసరం లేదు..
మరోవైపు కంకషన్ సబ్ స్టిట్యూట్ గా రాణాను తీసుకురావడంపై లిటిల్ మాస్టర్, మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఫైరయ్యాడు. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, ఇలా కంకషన్ సబ్ స్టిట్యూట్లతో గెలవాల్సిన ఖర్మ ఏంటని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ను ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు. తన 11 మంది ప్లేయర్లతో ఇండియా గెలవదని, కంకషన్ సబ్ స్టిట్యూట్ లాంటి చేష్టలతో గెలవాల్సిన అవసరం భారత్ కు లేదని పేర్కొన్నాడు. ఇక ఆ మ్యాచ్ లో కంకషన్ సబ్ స్టిట్యూట్ అవసరమే లేదన్నాడు. గాయం తగిలేటప్పటికే బ్యాటింగ్ పూర్తి కావడంతో దూబే స్థానంలో వేరే ఏ ప్లేయర్ నైనా తీసుకుంటే బాగుండేనని పేర్కొన్నాడు.
ఏదేమైనా 5 టీ20ల సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం జోరు మాత్రం తగ్గడం లేదు. అయితే ఐదో టీ20లో 150 పరుగులతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి తనపై వస్తున్న విమర్శలకు ఇండియా ధీటైనా జవాబిచ్చింది. ఇక ఈనెల 6 నుంచి ఇంగ్లాండ్, ఇండియా ల మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.




















