Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Manchu Family Issue: మోహన్ బాబు, మనోజ్ కలెక్టర్ ఎదుట మరోసారి ఘర్షణ పడ్డారు. దీంతో అప్పటికి వారిని పంపేసిన కలెక్టర్ వచ్చేవారం మరోసారి రావాలని ఆదేశించారు.

Mohan Babu and Manoj once again clashed in front of the collector: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ఈ సారి అధికారుల ముందుకు చేరింది. గతంలో మోహన్ బాబు తన ఆస్తుల్లో ఇతరులు పాగా వేశారని.. వారిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్ హోదా ఉన్న కలెక్టర్ కు లేఖ రాశారు. దీంతో కలెక్టర్ ఆ ఆస్తుల్లో ఉంటున్న మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. గతంలో ఓ సారి మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరై తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చి తన వాదన వినిపించారు. తర్వాత కలెక్టర్ ఇద్దర్నీ ఒకే సారి తన ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం వారిద్దరూ జిల్లా కలెక్టర్ కమ్ మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ ఎదుట హాజరయ్యారు.
విచారణలో మెజిస్ట్రేటే ఎదుట మంచు తండ్రి.. మంచు కుమారుడు ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ పెద్ద ఎత్తున వాదులాడుకున్నట్లుగా తెలుస్తోంది. పరస్పరం దూషించుకున్నారని.. చెబుతున్నారు. రెండు గంటల పాటు మేజిస్ట్రేట్ విచారణ జరిగినా వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దాంతో ఆస్తి తగదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కు పూర్తి వివరాలు అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడలేదు. ఆయన చాలా అసహనంగా కనిపించారు. వచ్చే వారం మరోసారి ఎదుట విచారణ హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.
మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఇటీవలే రోడ్డున పడింది. ఓ ఆదివారం తండ్రీ కొడుకులు ఇద్దరూ పరస్పరం డయల్ 100కు ఫోన్ చేసి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లే సరికి అంతా సర్దుకుందని చెప్పి పంపేశారు. కానీ ఆ తర్వాత వరుసగా వివాదాలు చోటు చేసుకుంటూ వచ్చాయి . చివరికి అది మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యే వరకూ వెళ్లింది. తర్వాత జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్ ఉంటున్నారు. మోహన్ బాబు తిరుపతి లో తన ఎంబీయూ యూనివర్శిటీకి వెళ్లారు. అయితే మనోజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడికీ వెళ్లడంతో అక్కడ కూడా ఘర్షణ జరిగి కేసులు నమోదయ్యాయి.
మోహన్ బాబు తన సంపాదన అంతా స్వార్జితం అని .. తన ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది తన ఇష్టమని ఆయన చెబుతున్నారు. ఆయితే ఆస్తుల కోసం తమ పోరాటం సాగడం లేదని.. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మంచు మనోజ్ అంటున్నారు. తాను కూడా వ్యాపార సంస్థల అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించానని ఎవరి సొత్తూ కాదని చెబుతున్నారు. జల్ పల్లి నివాసం తనదని.. అక్కడ్నుంచి ఖాళీ చేయించాలని.. మోహన్ బాబు కోరుతున్నారు. అయితే మనోజ్ మాత్రం.. ఆ ఇంట్లో తనకూ హక్కు ఉందని వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు వాదనలు పూర్తి కాకపోవడంతో.. వచ్చేవారం మేజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయంను బట్టి మనోజ్ మోహన్ బాబు తదుపరి యాక్షన్ ప్లాన్ ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

