మోహన్ బాబు సినిమా అంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ఆయనతో సినిమా అంటే ఒకప్పుడు హిట్ గ్యారెంటీ. కామెడీ నుంచి విలనిజం వరకు ఏదైనా అవలీలగా చేసేసే గొప్ప నటుడు మోహన్ బాబు. మోహన్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన ‘సన్ ఆఫ్ టాలీవుడ్’. దాసరికి మోహన్ బాబు అంటే ప్రాణం. టాలీవుడ్‌లో గొప్ప గురుశిష్యులు వీరే. సినిమాల్లోకి రాక ముందు మోహన్ బాబు కొన్నాళ్లు వ్యాయామ ఉపాధ్యుడిగా పనిచేశారు. 1970 నుంచి ఐదేళ్లు దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఆయన్ని.. 1970లో ‘స్వర్గం నరకం’ సినిమాతో హీరోను చేశారు దాసరి. మోహన్ బాబు చిత్తూరు జిల్లా మోదుగలపాళెంలో 1952, మార్చి 19న జన్మించారు. చిత్తూరు ప్రజలకు మేలు చేయడం కోసం మోహన్ బాబు తిరుపతిలో ‘శ్రీ విద్యానికేతన్’ ప్రారంభించారు. తన విద్యా సంస్థ ద్వారా మోహన్ బాబు పేద విద్యార్థులకు రాయితీతో విద్యను అందిస్తున్నారు. కళా, విద్యా రంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ కేంద్రం 2007లో పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ముక్కుసూటితనం మోహన్ బాబుకు పెట్టింది పేరు. కానీ, అదే ఆయనకు ‘మైనస్’ అంటారు అభిమానులు. టాలీవుడ్‌కు ఎన్నో మరుపురాని చిత్రాలిచ్చిన కలెక్షన్ కింగ్ ఇప్పుడు కంట్రవర్శీలకు కేంద్రమవుతున్నారు. టాలీవుడ్ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు, చిరంజీవి మధ్య నెలకొన్న వివాదం చర్చనీయమైంది. ఇప్పటికీ చిరు - మంచు మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరింత ముదిరింది. కారణాలు ఏమైనా మోహన్ బాబు, ఆయన వారసుల చిత్రాలకు ప్రేక్షకాధరణ కరవవ్వుతోంది. ఏది ఏమైనా, టాలీవుడ్‌కు మోహన్ బాబులాంటి నటుడు దొరకడం నిజంగా అదృష్టమే. హ్యాపీ బర్త్ డే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. Images Credit: Mohan Babu/twitter