Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
End Of Maoists: 'మావోయిస్టుల ప్రస్థానం ఇక పూర్తైపోయినట్టేనా.?' ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇప్పటికే టాప్ లీడర్లు మృతి చెందగా.. దండకారణ్యంలో భద్రతా దళాలు జల్లెడ పట్టేస్తున్నాయి.

Big Shock To Maoists: "నక్సల్ ఉద్యమం చివరి దశకు చేరుకుంది. 2026 మార్చి నాటికి వారి కథ ముగించేస్తాం" ఈ మధ్య కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతకంటే ముందే మావోయిస్టు ఉద్యమాన్ని అణిచేసే పనిలో కేంద్ర బలగాలు ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త ఏడాది వచ్చి 20 రోజులు పూర్తికాకముందే రెండు ఎన్‌కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. తాజాగా జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది చనిపోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, గుడ్డూ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది మావోయిస్టులకు చావు దెబ్బగా చెప్పవచ్చు.
కోబ్రా, CRPF దళాలతో పాటు లొంగిపోయిన మాజీ నక్సలైట్స్‌కు శిక్షణనిచ్చి మావోయిస్టులపైకి ప్రయోగించడం భద్రతా దళాలకు ప్లస్ అయింది. దండకారణ్యంలోని అణువణువు తెలిసిన ఈ మాజీ నక్సలైట్లను ముందు పెట్టి భద్రత దళాలు వేట కొనసాగిస్తున్నాయి. దాదాపు 1000 మంది సైనికులు పన్నిన పద్మవ్యూహంలో 60 మంది మావోయిస్టులు చిక్కుకుపోయినట్టు సమాచారం. ఎటువైపు తప్పించుకోకుండా వారికున్న అన్ని దారులు మూసేయడంతో నక్సలిజం చిక్కుకుపోతోంది.
ఏఓబీలో కనుమరుగైన మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారు. ఇక్కడ వారు చేసిన చివరి అతి పెద్ద ఆపరేషన్ అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా హత్యలే. ఇది జరిగి 7 ఏళ్లు దాటిపోయింది. ఆ ఘటన తర్వాత ఉత్తరాంధ్రలో పోలీసుల ఎదురుదాడి ఎక్కువ అవ్వడంతో AOBలో మావోయిస్టులు ఖాళీ అయిపోయారు. ఆ హత్యలకు సూత్రధారి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
అగ్ర నాయకులందరూ "అవుట్ "
ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు నాయకులు లేక అల్లాడుతున్నారు. RK, అజాద్ లాంటి వాళ్లు చనిపోయారు. గణపతి ఏమయ్యాడో తెలియదు. హిడ్మా అజ్ఞాతంలో ఉన్నాడు. మిగిలిన నాయకుల్లో కొందరు వృద్ధాప్యంతోనూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మావోయిస్టులకి దిశానిర్దేశం చేసేవారు కరవయ్యారు.
మావోయిస్టుల పతనానికి కారణాలు ఇవే..
1) ప్రజల మద్దతు కోల్పోవడం.
ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పీడిత గ్రామాల మద్దతు ఉండేది. కాని ఇటీవల కాలంలో ప్రజలకు చట్టాలపై అవగాహన పెరగడం, ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వంలోని పెద్దల వరకు ఆ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉండడంతో అన్నలపై ఆధారపడాల్సిన అవసరం మారుమూల గ్రామాలకు కూడా లేకుండా పోయింది.
2) దిశ లేని ప్రయాణం
60 ఏళ్ల మావోయిస్టు ఉద్యమం చెప్పుకోవడానికి ఒకటి రెండు విజయాలు మినహా సాధించిందేమీ లేదనే అభిప్రాయం సామాన్యుల్లోకి వెళ్లిపోయింది. నేపాల్ లాంటి దేశాల్లో సైతం చివరికి తుపాకీ విడిచిపెట్టి ఓటింగ్ ద్వారా అధికారంలోకి రాగలిగారు వామపక్ష అతివాదులు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. మన దేశంలో మాత్రం మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ పాయింట్ ఏంటి అన్నది వాళ్ల నాయకులే స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరుగుతున్న 60 ఏళ్ల రక్తపాతానికి అంతిమ అధ్యాయం ఏంటనేది ఎవరూ చెప్పలేరు.
3) ఆగిపోయిన రిక్రూట్మెంట్లు
ఒకప్పుడు మావోయిస్టులు ఉన్నత విద్యాసంస్థల్లో చదివి నిరుద్యోగం, ప్రజా సమస్యల పట్ల ఆవేశం ఉన్న వారిని గుర్తించి తమ ఉద్యమంలోకి ఆహ్వానం పలికేవారు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ పుణ్యమా అంటూ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఏదో ఒక రంగంలో ఉపాధి పొందే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. దానికి తోడు సంప్రదాయ కోర్సుల స్థానంలో ఇంటర్మీడియట్ నుంచే ఎంసెట్ అని ఐఐటీ అని స్టూడెంట్స్‌కి చదువు తప్ప మరో అంశం మీద దృష్టి పెట్టేంత టైం దొరకడం లేదు. పోటీ ప్రపంచంలో పరిగెట్టడం మినహా అతివాద ఉద్యమంలోకి అడుగుపెట్టే అంత టైం లేదు. దానితో బాగా చదువుకున్న విద్యావంతులు మావోయిస్టుల్లోకి రిక్రూట్ కావడం లేదు
4) వేటాడేస్తున్న భద్రతా దళాలు
ఒకప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే దాని మీద వంద ఎంక్వయిరీలు, ప్రజాసంఘాల పోరాటాలను పోలీసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అది ఎదురు కాలుల్లో భాగంగా జరిగిందని వారి నుంచి వివరణ వచ్చేది. రాజకీయ పార్టీలు కూడా వాటిపై స్పందించడానికి పెద్దగా ఇష్టపడేవి కావు. కానీ ప్రస్తుతం మావోయిస్టులపై జీరో టోలరెన్స్‌తో ఉన్నామని లొంగిపోవడం లేదా చచ్చిపోవడం తప్ప మరొక ఆప్షన్ లేదని కేంద్ర హోంమంత్రి స్థాయిలో డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. అందుకే భద్రతా దళాలు మరింత వేగంగా చొచ్చుకుపోతున్నాయి.
5) పెరిగిన సాంకేతిక సహాయం
పోలీసులు, భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్‌ఫ్రారెడ్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు వినియోగం కేంద్ర బలగాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్ల సహాయంతో దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కోసం జల్లెడ పట్టేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం ఇంకా చాలావరకు సంప్రదాయ ఆయుధాలతో పోరాడుతున్నారు. దీంతో భద్రతా దళాలదేపై చేయి అవుతోంది.
6) అర్బన్ ఏరియా నుంచి కరువైన మద్దతు
ఒకప్పుడు మావోయిస్టులకు అర్బన్ ఏరియాల్లో సైతం షెల్టర్స్ ఉండేవి. అలాంటి వాటిని ఉపయోగించుకునే గతంలో ఐపీఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్లను హత్య చేశారు నక్సలైట్లు. కానీ రాను రాను అర్బన్ ఏరియాల్లో మావోయిస్టులకు మద్దతు కరవైంది. షెల్టర్స్ మొత్తం పోలీస్ నిఘాలోకి వచ్చేశాయి. దానితో ఉన్న కొద్దిమంది నక్సలైట్లు రిమోట్ ఏరియాలకే పరిమితం అయిపోయారు. అలాంటివారిని వివిధ శాఖల భద్రత దళాలు సంయుక్తంగా వేటాడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అమిత్ షా చెప్పినట్టు మావోయిస్టు సాయుధ ఉద్యమం క్లైమాక్స్కు చేరినట్టే కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

