Rupee At Record Low: రూపాయి చారిత్రాత్మక పతనం, డాలర్‌తో పోలిస్తే తొలిసారి రూ.87 కు క్షీణత
Rupee Sees Historic Fall: అమెరికా పెంచుతున్న సుంకాల భయాల మధ్య, భారత రూపాయి చారిత్రాత్మక పతనాన్ని చూసింది. తొలిసారిగా రూపాయి విలువ రూ.87ను కూడా దాటి రికార్డ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.

Indian Rupee At Record Low Against US Dollar: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చారిత్రాత్మక క్షీణతను చవి చూసింది, మొదటిసారిగా రూ. 87 స్థాయికి పైగా పతనమైంది. ఈ రోజు (సోమవారం, 03 ఫిబ్రవరి 2026) కరెన్సీ మార్కెట్ ప్రారంభంలో, డాలర్‌తో రూపాయి 42 పైసల పతనంతో 87.06 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఆ నష్టం 55 పైసలకు చేరింది. ఈ భారీ పతనం కారణంగా, యూఎస్ డాలర్‌తో భారత రూపాయి మారకం విలువ (Indian Rupee exchange rate against US Dollar) రూ. 87.16 కు పడిపోయింది.
రూపాయి ఎందుకు పడిపోతోంది?
ఈ రోజు రూపాయి పతనానికి కారణం డాలర్ ఇండెక్స్ (Dollar Index) బలపడడం. ఇది, డాలర్‌తో ట్రేడ్ చేసే కరెన్సీలపై ప్రభావం చూపించింది. అమెరికా విధించిన సుంకాలు డాలర్ ఆకర్షణను పెంచాయి, ఫలితంగా దీనికి వ్యతిరేకంగా పని చేసే అన్ని కరెన్సీలలో క్షీణత కనిపించింది. ముఖ్యంగా, వర్ధమాన దేశాలకు (Developing countries) అమెరికా నుంచి వస్తున్న సంకేతాలు, భారత కరెన్సీ రూపాయిని బలహీనపరిచేలా పని చేస్తున్నాయి.
కరెన్సీ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో కనిపించిన బలహీనత US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను 87.16 కనిష్ట స్థాయి వద్దకు పడిదోసింది. ఈ పతనం ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి పతనం వల్ల భారతీయ ఎగుమతి కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలపై సానుకూల ప్రభావం పడుతోంది, విప్రో షేర్లు లాభపడుతున్నట్లు కనిపిస్తోంది. ఐటీ కంపెనీలకు డాలర్లలో ఆదాయం వస్తుంది కాబట్టి, డాలర్ బలం ప్రభావంతో మన దేశంలోని ఐటీ కంపెనీల ఆదాయం రూపాయలలో చూస్తే పెరుగుతుంది.
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు బ్యాడ్ స్టార్టింగ్
భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు బ్యాడ్ స్టార్టింగ్ (Stock market today) చూసింది. ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ భారీ క్షీణతతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఇ సెన్సెక్స్ 442.02 పాయింట్లు లేదా 0.57 శాతం పతనంతో 77,063 వద్ద ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 162.80 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణతతో 23,319 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తొలి సెషన్‌లో ఈ నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 10.37 గంటల సమయానికి బీఎస్‌ఇ సెన్సెక్స్ 561.40 పాయింట్లు లేదా 0.72 శాతం జారిపోయి 76,944.56 వద్ద ఉంది.ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 209.20 పాయింట్లు లేదా 0.89 శాతం క్షీణించి 23,272.95 వద్ద ట్రేడయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఒకేసారి రూ.4,400 తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ





















