(Source: Poll of Polls)
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
భూ సామర్థ్య పరీక్షలు ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అలైన్‌మెంట్ స్థిరీకరణ, పెన్ మార్కింగ్ పనులు పూర్తయినట్లు చెప్పారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మరో ముందడుగు పడింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ నిర్మించే మెట్రో పిల్లర్ల కోసం భూసార పరీక్ష ప్రారంభం అయింది. ఈ సామర్థ్య పరీక్షలు ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అలైన్‌మెంట్ స్థిరీకరణ, పెన్ మార్కింగ్ పనులు పూర్తయినట్లు చెప్పారు.
భూసార పరీక్ష ఎలా చేస్తారంటే
భూసార పరీక్షలో భాగంగా ఐకియా జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు అక్కడక్కడ 100 మెట్రో పిల్లర్ల స్థలాలను ఎంపిక చేసి సరిగ్గా పిల్లర్ నిర్మించే ప్రదేశంలోనే నమూనాలను తీసుకొని భూ సామర్థ్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు పిల్లర్ నిర్మించే చోట 40 అడుగుల లోతు వరకు తవ్వి మెట్రో పిల్లర్ నిర్మాణానికి అనుకూలమా లేదా అనేది పరిశీలిస్తామని అన్నారు. ఈ మొత్తం భూసార పరీక్షలు చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. భూ సామర్థ్య పరీక్షలతో స్తంభాల పునాదులు ఏ మేరకు తవ్వాలనే దానిపై స్పష్టత రావడంతోపాటు, టెండర్ ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగే భూమి తీరుపై అవగాహన కలుగుతుందని మెట్రో ఎండీ చెప్పారు.
కొండల మీదుగా మెట్రో
రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు నిర్మించే మెట్రో మార్గం రెండు ఫ్లైఓవర్ల మీదుగా వెళ్లనుంది. మొదట రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తాల్లో ఫ్లై ఓవర్ల మీదుగా వెళ్తే.. ఆ తర్వాత ఖాజాగూడ చెరువు పక్కన ఎత్తయిన కొండలతో కూడిన ప్రాంతం ఉంది. ప్రతిపాదిత మెట్రో మార్గంలో భూ సేకరణ సమస్య తక్కువగా ఉన్నప్పటికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లై ఓవర్లు, కొండ ప్రాంతాలే అధికారులకు సవాలుగా మారుతున్నాయి. కొండలను చీల్చకుండా మెట్రో మార్గం కోసం పిల్లర్లను నిర్మించాల్సి వస్తున్నది. ఇలా రెండు చోట్ల ఎత్తయిన కొండ ప్రాంతాలను గుర్తించిన మెట్రో అధికారులు ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు.
మూడో స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మార్గంగా దేశంలో ఇప్పటిదాకా ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉండేది. కానీ, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. బెంగళూరు నగరంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా 13.71 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. దీంతో బెంగళూరు నమ్మ మెట్రో 70 కిలోమీటర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో 69.2 కిలోమీటర్లతో మూడోస్థానానికి దిగజారింది. 348 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ మెట్రో రైల్ మార్గం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోజుకు 42 లక్షల మంది ప్రజలు మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 255 మెట్రో రైల్ స్టేషన్లు ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై సంవత్సరాల తరబడి పాలకులు ప్రకటనలు చేస్తున్నారేగానీ క్షేత్ర స్థాయిలో విస్తరణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఇతర మెట్రో నగరాల్లో మెట్రో రైలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విస్తరణ పనులను శరవేగంగా చేస్తున్నారు. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.