చెత్తే సంపద-హైదరాబాద్ చుట్టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు వేగంగా అడుగులు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జవహర్‌నగర్‌లో 19.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని 24 మెగా వాట్స్‌కు పెంచారు. మరో 24 మెగావాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది.
హైదరాబాద్ నగరం రోజురోజుకూ వేగంగా అభివృద్ది చెందటంతోపాటు అంతే వేగంగా నలుదిశలా విస్తరిస్తోంది. రోజువారి అవసరాలతోపాటు వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో రోజువారీ సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా, ట్రీట్మెంట్ డిస్పోజల్ తరహాలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ వేగంగా అడుగులేస్తోంది. దీనిలో భాగంగా జిహెచ్ఎంసి పరిధితోపాటు, చుట్టూ పక్కల నగర పాలక సంస్థలలో సేకరించిన టన్నుల కొద్ది వ్యర్థాలను ఎప్పటి కప్పుడు నిల్వ ఉండకుండా డిస్పోజల్ చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది జిహెచ్ ఎంసీ.
భాగ్యనగరంతోపాటు చుట్టుప్రక్కల మున్సిపాలిటీల పరిధిలో రోజువారి వ్యర్థాలు ప్రతిరోజు సుమారు 7000 నుంచి 7500 మెట్రిక్ టన్నుల చెత్త ఉంటుంది. సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియ అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువుగా మార్చడం, బయోగ్యాస్ తయారు చేయడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం అంతేకాదు పొడి చెత్తలో మండే గుణం ఉన్న వ్యర్థాలను పోగు చేసి విద్యుత్ తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇలా చెత్తతో సంపదను సృష్టించేందుకు జిహెచ్‌ఎంసీ వేగంగా అడుగులేస్తోంది.
Hyderabad already hosts south India’s largest waste to energy plant with 20MW capacity. Since it’s launch, it has generated more than 225MW of power!
— KTR (@KTRTRS) January 10, 2023
Happy to share that we are now scaling up multiple plants with an ambition to generate 100 MW of Power from Waste#Waste2Energy pic.twitter.com/YAjelnCydK
ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జవహర్‌నగర్‌లో 19.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని 24 మెగా వాట్స్‌కు పెంచారు. మరో 24 మెగావాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. జవహర్ నగర్‌లో మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ త్వరలో సిద్దం కాబోతోంది. ఇప్పటికే వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ గతంలో ఉన్న 19.8 మెగా వాట్ ప్లాంట్ కోసం రోజుకు సుమారు 1300 టన్నుల నుంచి 1500 టన్నుల వ్యర్థాలు (ఆర్.డి.ఎఫ్) ఉపయోగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 6.35 లక్షల ఆర్ డి ఎఫ్ (Refuse Derived Fuel) ను వినియోగించుకొని 225 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
ఇలా చెత్తతో సంపద సృష్టించాలని ఉద్దేశ్యంతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు జిహెచ్ఎంసి చర్యలు తీసుకుంది. సేకరించిన చెత్తను వెను వెంటనే నిల్వ ఉంచుకోకుండా మొత్తాన్ని వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి ముఖ్య ఉద్దేశ్యం. చెత్తతో సంపద సృష్టించేందుకు నగరం నలువైపులా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌లను ఏర్పాటుకు జిహెచ్ఎంసి సిద్దమవుతోంది. ఇప్పటికే దుండిగల్‌లో మరో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఇవి మార్చి నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్లాంట్ ఉత్పత్తి ఆరంభించిన వేళ మరో 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం ఉంటుంది.
సంగారెడ్డి జిల్లా ప్యారా నగర్‌లో జిహెచ్ఎంసి ద్వారా 15 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల, ఉత్తర ప్రాంతం నుంచి సేకరించిన చెత్త ప్యారా నగర్ తరలించి విద్యుత్ తయారీకి రోజుకు సుమారు 800 నుంచి 1000 టన్నుల ఆర్.డి.ఎఫ్ ని వినియోగించుకుంటున్నారు. బీబీ నగర్‌లో 11 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తైంది. కానీ ఆ కంపెనీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ సంస్థను వేరే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ ప్లాంట్ మూలంగా 800 నుంచి 900 వరకు చెత్తను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇబ్రహీంపట్నం మండలం, యాచారంలో 12 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అయితే 12 మెగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను 14 మెగా వాట్ల కెపాసిటీ పెంచనున్నారు. ఇలా రోజువారి సేకరించిన చెత్తను నిల్వ ఉండకుండా ట్రీట్మెంట్, డిస్పోజల్ ద్వారా మొత్తం చెత్తను వినియోగించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో జిహెచ్ఎంసి ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా సాధ్యమైనంత విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది తెలంగాణా ప్రభుత్వం.