Kohli In RCB: పేసర్ కోసం విరాట్ ను వదులుకున్న ఫ్రాంచైజీ.. ఆర్సీబీలోకి తన ఎంట్రీని గుర్తు చేసుకున్న కోహ్లీ
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ ఏడాదితో కలిపి వరుసగా 18 సీజన్లు ఆడబోతున్నాడు. లీగ్ లో విరాట్ మినహా మరే క్రికెటర్ ఇంతకాలం ఒకే జట్టు తరపున ఆడిన దాఖలా లేదు.

Virat Kohi Comments; భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ ఏడాదితో కలిపి వరుసగా 18 సీజన్లు ఆడబోతున్నాడు. లీగ్ లో విరాట్ మినహా మరే క్రికెటర్ ఇంతకాలం ఒకే జట్టు తరపున ఆడిన దాఖలా లేదు. అయితే నిజానికి విరాట్ ను 2008 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) కొనుగోలు చేయాల్సింది. అయితే వారి లెక్కలు తప్పడంతో విరాట్ లాంటి బ్యాటర్ ను మిస్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీ కంటే ఒక పేసరే మిన్న అని ఢిల్లీ ఆలోచించడంతో ఆర్సీబీ చెంతకు కోహ్లీ చేరాడు. అప్పుడు జరిగిన విషయాలను తాజాగా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2008 అండర్ -19 వన్డే ప్రపంచకప్ ముగిశాక, తనపై ఢిల్లీకి ఆసక్తి ఉందని తెలిసిందని, తనను వాళ్లు పిక్ చేస్తారని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. అయితే అనూహ్యంగా తాను ఆర్సీబీకి వచ్చానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
స్పెషల్ వేలం..
అండర్-19 ప్రపంచకప్ కప్ ముగిశాక ఇందులో పాల్గొన్న ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా వేలం నిర్వహించారు. అయితే ఢిల్లీ తొలుత తన వైపు ఆసక్తి చూపించినా, అప్పుడున్న పరిస్థితుల్లో పేసర్ ప్రదీప్ సాంగ్వాన్ వైపు ఫోకస్ పెట్టారని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పటికే వాళ్ల బ్యాటింగ్ టీమ్ లో వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, గౌతం గంభీర్, దినేశ్ కార్తీక్, మనోజ్ తివారీ లాంటి దేశీ ప్లేయర్లతోపాటు తిలకరత్నే దిల్షాన్, ఏబీ డివిలియర్స్ వంటి ఇంటర్నేషనల్ స్టార్లు ఉన్నారని అందుకే వారికి పెద్దగా బ్యాటర్ అవసరం పడలేదని కోహ్లీ విశ్లేషించాడు. అందుకే ఆ టోర్నీలో సత్తా చాటిన సాంగ్వాన్ ను తీసుకుని, బౌలింగ్ ను పటిష్ట పరుచుకున్నాడని తెలిపాడు.
ఇప్పుడు ఆశ్చర్యమే..
ఐపీఎల్లో వరుసగా 18వ ఏడాది ఆర్సీబీ తరపున కోహ్లీ పాల్గొవడం విశేషం. అయితే తొలుత తను ఒకలా భావిస్తే, డెస్టినీ మరోలా చేసిందని కోహ్లీ తెలిపాడు. అయినా ఆటను ఆస్వాదించడం ఎప్పుడు కొనసాగించానని పేర్కొన్నాడు. ఢిల్లీకి చెందిన కోహ్లీని ఢిల్లీ జట్టు తీసుకుంటుందని అప్పట్లో భావించినా, వివిధ సమీకరణాలతో ఆర్సీబీలోకి వచ్చి చేరాడు. ఆ తర్వాత తన సత్తా చాటడంతో ఆర్సీబీ పెర్మినెంట్ మెంబర్ గా మారిపోయాడు. ఇక ఐపీఎల్ 2025 శనివారం నుంచి ప్రారంభమవుతోంది. స్టార్టింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ ఢీకొననుంది. మూడుసార్లు ఫైనల్స్ కు చేరినా, రన్నరప్ తోనే సంతృప్తి పడినా ఆర్సీబీ, ఈ సీజన్ లో కప్పు గెలవాలని తహతహలాడుతోంది. మరోవైపు గతేడాది టీ20లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఏడాది ఐపీఎల్లో తను ఎలా ఆడతాడో అనే దానిపై అందరి ఫోకస్ నిలిచింది. అంతర్జాతీయంగా ఎన్నో టోర్నీలు సాధించినా, ఐపీఎల్ టైటిల్ మాత్రం విరాట్ కోహ్లీ జీవితంలో వెలితిగా నిలిచి పోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

