CM Revanth Reddy: డీలిమిటేషన్‌ను మేం అంగీకరించం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మారే ప్రమాదం ఉంది: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy | డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరుస్తోందని, ఈ ప్రక్రియ జరగాలంటే దక్షిణాదికి లోక్‌సభలో 33 శాతం సీట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Fair Delimitation: ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది, బీజేపీ జనాభా విధానాన్ని కొనసాగిస్తోంది.. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపుగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని, నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టాలి. దేశమంటే అన్ని రాష్ట్రాల కలయిక. నియోజకవర్గాల పెంపుపై మన అభిప్రాయాలను పంచుకోవాలి.. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలి. నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నా... డీలిమిటేషన్ పై మనందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి.
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..
- ప్రస్తుతం దేశం Delimitation తో పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి.. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి.
#WATCH | Chennai, Tamil Nadu: At the meeting on delimitation, Telangana CM Revanth Reddy says, "Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty...We are one country, we respect it. But we cannot accept this proposed… pic.twitter.com/MivORWGtSK
— ANI (@ANI) March 22, 2025
దేశ ఖజానాకు మనం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చినా తక్కువ మొత్తాన్ని పొందుతున్నాం. తమిళనాడు నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ కేంద్రానికి రూపాయి ఇస్తే.. రెండు రూపాయల 73 పైసలు వెనక్కి వస్తున్నాయి. బిహార్ రూపాయి చెల్లిస్తే 9 రూపాయల 22 పైసలు వెనక్కి తీసుకుంటోంది. కేరళకు 62 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కర్ణాటకకు కేవలం 14 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. మధ్య ప్రదేశ్ రూపాయి కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు ఇస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మనం అంగీకరించం.. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు.. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోంది. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా కలిసికట్టుగా బీజేపీని అడ్డుకోవాలి..
1) సీట్లు పెంచొద్దు.. ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం అలానే పునర్విభజన చేపట్టింది. లేకుంటే రాష్ట్రాల మధ్య రాజకీయ తేడాలు (అసమతౌల్యాలు) వచ్చేవి. 2001లో ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించింది. లోక్‌సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆ విధంగా చేయగలరా?
2) జనాభా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోంది... బీజేపీ ప్రతిపాదించిన జనాభా దామాషా పద్దతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాం. ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించివేస్తారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చలాయిస్తాయి. బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ఏకం కావాలి...
3) ప్రొరేటా విధానాన్ని అంగీకరించలేం... ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుంది.. ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుంది. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర ఉంది. కాబట్టి ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది.
మనం అంగీకరించే ఆప్షన్లు ఏమిటంటే...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాని వాజ్‌పేయీ విధానాన్ని పాటించాలి. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో మార్చవద్దు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలి..
జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలి. తెలంగాణలోని మల్కాజిగిరి ఎంపీగా చేశాను.. అది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజకవర్గం. అక్కడ మొత్తం జనాభా 45 లక్షలైతే ఓటర్లు 32 లక్షలు. కనుక ఈ సమస్యను నేను పూర్తిగా అర్ధం చేసుకోగలను. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను స్థానిక సంస్థలు, రాష్ట్రాలు, శాసనసభల పరిధిలోనే పరిష్కారమవుతాయి.
జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలి... దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వరకు 50 ఏళ్ల పాటు మనం అందించిన సేవలకు మనల్ని అభినందించాలి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన చేపట్టొద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలి..
పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనుకుంటే నా ప్రధాన డిమాండ్ ఇదే...
543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్లలో 24 శాతం.. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని మా డిమాండ్. బీజేపీ 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ సభ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలి...ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చు...
పునర్విభజన ప్రక్రియపై మా రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తాం... మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. దక్షిణ భారతదేశ పౌరుల గళానని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దాం. పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తాను.. మన పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళదామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దాం.... ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను నేను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు























