Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Unemployment Politics: ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఓ రకమైన ఉద్యమం.. ఇస్తే మరో రకమైన ఉద్యమం... భర్తీ పూర్తి అయితే మరో రకమైన ఉద్యమ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఏదైనా వివాదమే !

Job recruitment politics Andhra Telangana 2026: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు, మరోవైపు రాజకీయ పార్టీల వ్యూహాలకు వేదికగా మారుతోంది. ఆంధ్రాలో డీఎస్సీ ప్రక్రియ నుండి తెలంగాణలోని పోలీసు కానిస్టేబుల్, టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల వరకు ఎలాంటి ఉద్యోగ ప్రకటన వచ్చినా, దాని చుట్టూ రగిలే వివాదాలు రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉన్న పోస్టులను భర్తీ చేయడం వల్ల దక్కే లబ్ధిదారుల కంటే.. ఉద్యోగాలు సాధించలేకపోయిన లక్షలాది మంది యువతలో ఉత్పన్నమయ్యే అసంతృప్తినే రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన ఓటు బ్యాంకు గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
వే మంది సంతృప్తి vs లక్షలాది మంది అసంతృప్తి
ఒక నోటిఫికేషన్‌లో 10,000 పోస్టులు ఉంటే, దానికి 5 నుండి 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేస్తారు. చివరికి ఉద్యోగం వచ్చేది కేవలం ఆ 10,000 మందికే. మిగిలిన 9,90,000 మంది యువతలో సహజంగానే నైరాశ్యం, నిరాశ వ్యక్తమవుతాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సరిగ్గా ఈ అసంతృప్తినే ఆసరాగా చేసుకుంటున్నాయి. భర్తీ ప్రక్రియలోని చిన్న చిన్న లోపాలు, రిజర్వేషన్ వివాదాలు లేదా కటాఫ్ మార్కుల గందరగోళాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేస్తూ, ఉద్యోగాలు రాకపోవడానికి ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమనే ప్రచారాన్ని వేగంగా సమాజంలోకి తీసుకెళ్తున్నాయి.
ఏపీ డీఎస్సీ నుండి తెలంగాణ కానిస్టేబుల్ వరకు*
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ విషయంలో నిబంధనలు, స్పోర్ట్స్ కోటా, హారిజాంటల్ రిజర్వేషన్లు, పేపర్ లీకేజీ పుకార్లు వంటి రకరకాల అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వెలువడినప్పుడు కూడా పోస్టుల సంఖ్య సరిపోలేదని, వయోపరిమితి సడలింపులు చాలవని లేదా ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్టుల్లో నిబంధనలు సరిగా లేవంటూ ఆందోళనలు రేగాయి. నోటిఫికేషన్ జారీ కావడం ఆలస్యమైతే ఒక రకమైన నిరసనలు, నోటిఫికేషన్ వచ్చాక అందులోని నిబంధనలపై మరో రకమైన కోర్టు కేసులు.. ఈ విధంగా ఉద్యోగ ప్రక్రియ నిరంతరం సవాలుగా మారుతోంది.
సోషల్ మీడియా ప్రభావం - నిమిషాల్లో పెరిగే ఆగ్రహం
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు నిరుద్యోగ యువతను ఏకం చేయడానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో, అంతే వేగంగా అసత్యాలు, గందరగోళ ప్రచారాలు వ్యాపించడానికి వేదికగా మారుతున్నాయి. ఒక చిన్న నోటీసు లేదా సాంకేతిక లోపంపై తప్పుడు కథనాలు వ్యాప్తి చెందగానే, అభ్యర్థులు వీధుల్లోకి వచ్చే వాతావరణం ఏర్పడుతోంది. దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు రావడంతో పాటు, ఉద్యోగ నియమకాలన్నీ రక రకాల కోర్టు స్టేలతో ఏళ్ల తరబడి నిలిచిపోతున్నాయి.
నియామకాలు చేపడితే రాజకీయ వివాదాలు, ధర్నాలు, లీగల్ చిక్కులు ఎదురవుతున్నందున అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉండటమే మంచిదా అనే సందేహం రావడం సహజమే. కానీ ప్రభుత్వాలు పూర్తిగా సైలెంట్‌గా ఉండటం సాధ్యపడదు. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఎదురయ్యే వ్యతిరేకత ఇంకా తీవ్రంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధి పథకాలు పై దృష్టి పెడుతున్నాయి. ఉద్యోగ భర్తీ ప్రక్రియను కేవలం ఓట్ల కోణంలోనే చూసే ధోరణి తగ్గకపోతే, నష్టపోయేది చివరికి కష్టపడి చదివే నిరుద్యోగ అభ్యర్థులే. పొలిటికల్ మైలేజ్ కోసం యువత అసంతృప్తిని రెచ్చగొట్టడం కంటే, భర్తీ ప్రక్రియ సరైన పద్ధతిలో జరిగేలా ఒత్తిడి తీసుకురావడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















