AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషనే వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈసారి 2500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ దఫా సుమారు 2500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా పరీక్ష విధానంలో కూడా మార్పులు చేస్తోంది.
రాష్ట్రంలో గతే ఏడాది ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. అయినా ఇంకా ఉపాధ్యాయుల కొరత ఉండనే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది కూడా భారీగా ఉపాధ్యాయులు ఉద్యోగాల నుంచి రిటైర్ కానున్నారు. పాఠశాల విద్యాశాఖ జరిపిన తాజా సమీక్షలో మొత్తం ఖాళీలు 2500 వరకు ఉన్నట్టు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత తగ్గకుండా ఉండాలంటే ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
జీవో 117 రద్దు
విద్యారంగంలో సంస్కరణల్లో భాగంగా గతంలో వివాదాస్పద జీవో 117ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో తొమ్మిది కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చి దిద్దారు. ఈ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు.
ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ ఖాళీలపై స్పష్టత వచ్చింది. బదిలీల అనంతరం సుమారు 1146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో తాత్కాలికంగా అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయినా శాస్వత ప్రాతిపదికన డీఎస్సీ ద్వారా వీరిని భర్తీచేయాలని మరో నోటిఫికేషన్ వేయనున్నారు.
పరీక్ష విధానంలో మార్పులు
ఈసారి డీఎస్సీ రాసే అభ్యర్థులకు ఒక కొత్త సవాలు ఎదురుకానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు ఆంగ్లభాషా ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక ప్రత్యేక పేపర్‌ను ప్రవేశ పెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు కేవలం సబ్జెక్ట్ నైపుణ్యాలకే పరిమితమైన డీఎస్సీ, ఇకపై ఏపీపీఎస్సీ తరహాలో అభ్యర్థుల బహుముఖ నైపుణ్యాలను పరీక్షించనుంది.
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఆంగ్ల భాషపపై పట్టు సాధించేలా చేయాలంటే బోధించే ఉపాధ్యాయులకు ఆ నైపుణ్యం ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన, అందుకే ఈ కొత్త పేపర్‌ను డీఎస్సీలో అంతర్భాగం చేయనున్నారు. ఇది అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది.
టెట్ ఫలితాలపై ఉత్కంఠ
గత నెలలో నిర్వహించిన టెట్ లితాలను జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా పరిశీలిస్తున్నారు. అనంతరం ఫైనల్ కీ విడుదల చేస్తారు. తర్వాత ఫలితాలను రిలీజ్ చేస్తారు. డీఎస్సీకి టెట్ అర్హత ప్రాధాన్యత కలిగినది కావడంతో ఈ ఫలితాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు.





















