SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘనవిజయం.. నాకౌట్ జట్ల ఖరారు.. రేపు కీలక మ్యాచ్
ఛేజింగ్ లో డస్సెన్, క్లాసెన్ అద్భుతంగా ఆడి, ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. క్లాసెన్ ఎదురుదాడికి దిగగా, డస్సెన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్ కు 127 పరుగులు జోడించారు.

SA In Semis : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టాప్- 4 జట్లేంటో తేలిపోయాయి. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించడంతో సెమీ ఫైనల్ కు చేరిన నాలుగు జట్లపై స్పష్టత వచ్చింది. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక గ్రూప్-ఏలో న్యూజిలాండ్, భారత్ ప్రస్తుతం టాప్ - 2లో నిలిచాయి. ఆదివారం కివీస్, ఇండియా జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. ఆ జట్టు సెమీస్ లో ఆస్ట్రేలియాతో, మరో జట్లు.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.
కరాచీలో గ్రూప్-బిలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఏడు వికెట్లతో ఏకపక్ష విజయాన్ని సౌతాఫ్రికా సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ వైఫల్యంతో 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ జో రూట్ (37) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో చెరో మూడు వికెట్లతో మార్కో యాన్సెన్, వియాన్ మల్దర్.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. టార్గెట్ ను కేవలం 29.1 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసి, ఛేదించింది. వన్ డౌన్ బ్యాటర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (87 బంతుల్లో72 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చివరి కంటా నిలిచి, జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జోఫ్రా ఆర్చర్ కు రెండు వికెట్లు దక్కాయి. యాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
South Africa and Australia 🔝 Group B as they head into the #ChampionsTrophy semis unbeaten 💥
— ICC (@ICC) March 1, 2025
Read more ➡️ https://t.co/kgBGk3K3YX pic.twitter.com/1BSsPlOrBy
టపటపా..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కు అదిరే ఆరంభం దక్కలేదు. ఇప్పటికే వరుసగా రెండు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్ లో చాలా నిరాశపూరితమైన బ్యాటింగ్ చేశారు. కనీసం పరువు కోసమైనా ఈ మ్యాచ్ గెలవాలనే కసి కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో 129-7తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. అంతకుముందు రూట్, బెన్ డకెట్ ((24), కెప్టెన్ జోస్ బట్లర్ (21) తమకు దొరికిన శుభారంభాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్లు పోగొట్టుకున్నారు. చివర్లో ఆర్చర్ (25) మరోసారి తన బ్యాట్ కు పదును పెట్టడంతో ఇంగ్లాండ్ 170+ పరుగులను దాటింది. మిగతా బౌలర్లలో కేశవ్ మహారాజ్ కు రెండు, లుంగీ ఎంగిడి, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.
డస్సెన్, క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్..
ఇక చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ గా కొత్త అవతారం ఎత్తిన ట్రిస్టన్ స్టబ్స్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (27) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (56 బంతుల్లో 64, 11 ఫోర్లు) అద్భుతంగా ఆడి, ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా క్లాసెన్ ఎదురుదాడికి దిగి, ఇంగ్లీష్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగా, డస్సెన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో మూడో వికెట్ కు 127 పరుగులు జోడించారు. ముందుగా 41 బంతుల్లో క్లాసెన్, ఆ తర్వాత 72 బంతుల్లో డస్సెన్ ఫిప్టీ పూర్తి చేసుకున్నారు. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉండగా క్లాసెన్ ఔటయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (7 నాటౌట్) సిక్సర్ కొట్టి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మిగతా బౌలర్లలో ఆదిల్ రషీద్ కు ఒక వికెట్ దక్కింది.




















