(Source: ECI/ABP News/ABP Majha)
తినే తిండి కల్తీ చేశారో ఖబడ్దార్! ఆహార కల్తీ నియంత్రణకు GHMC స్పష్టమైన ఆదేశాలు
GHMC On Food Adulteration: కర్రీ పాయింట్స్ నుంచి కాకా హోటల్ మొదలుకుని, పెద్దపెద్ద స్టార్ హోటళ్ల వరకు అన్నీ బిజీబిజీగా ఉంటాయి. కొన్నిచోట్ల రాత్రి పగలు తేడా లేకుండా 24X7నడుస్తాయి.
GHMC On Food Adulteration: ఫుడ్ బిజినెస్! హైదరాబాద్ మహానగరంలో ఫుల్ స్వింగ్ మీదుండే వ్యాపారం! ఈ సెక్టారులో ఏది రన్ చేసినా సక్సెస్‌ఫుల్లే! బిస్కెట్ల నుంచి బిర్యానీ వరకు జనం ఏం పెట్టినా తింటారు! కోటిన్నర జనాభా ఉన్న నగరంలో రెస్టారెంట్లు, హోటళ్లకు కొదవలేదు. కర్రీ పాయింట్స్ నుంచి కాకా హోటల్ మొదలుకుని, పెద్దపెద్ద స్టార్ హోటళ్ల వరకు అన్నీ బిజీబిజీగా ఉంటాయి. కొన్నిచోట్ల రాత్రి పగలు తేడా లేకుండా 24X7నడుస్తాయి. ఈ క్రమంలో ఏది కల్తీయో, ఏది అసలైందో తేల్చడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఎంత నజర్ పెట్టినా ఏదోఒక చోట కల్తీరాయుళ్లు కాసులకు కక్కుర్తి పడుతూనే ఉంటారు. అలాంటి దుర్మార్గాలు రోజుకు ఎక్కడో చోట తారసపడుతునే ఉంటాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మరోసారి కల్తీమీద కత్తి ఝళిపించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై హెల్త్ అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజాతో కలిసి మేయర్ సమీక్షించారు.
నగరంలో కల్తీ నియంత్రణకు ఏర్పాటుచేసిన పుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా తనిఖీలు చేసి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మేయర్ విజయలక్ష్మీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధిలో షాపులను, రెస్టారెంట్లను విధిగా తనిఖీ చేసి, కల్తీ ఉన్నపక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. కొందరు అధికారులు నామమాత్రంగా చెక్‌చేసి, కల్తీ ఉన్నట్టు రుజువైనా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని, అది తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇకనైనా వారు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు గతంలో రోజువారి తనిఖీల లెక్కలు పంపమని ఆదేశించినా, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి సమాచారం ఇవ్వలేదని మేయర్ అసహనం వ్యక్తంచేశారు. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, మీల్స్ సెంటర్లు, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లను రెగ్యులర్ తనిఖీలు చేయాలని గట్టిగా ఆదేశించారు.
ఆహారకల్తీ నియంత్రణలో ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు మేయర్ విజయలక్ష్మీ. కల్తీ నియంత్రణలో భాగంగా స్ట్రీట్ వెండర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే బాధ్యత అధికారులదే అన్నారామె. హోటల్స్, రెస్టారెంట్లలో ఉన్న కిచెన్లను నిత్యం పరిశీలించాలని సూచించారు. నిబంధనలు ఉలంఘించిన రెస్టారెంట్లు, హోటళ్లకు నోటీసు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఏదైనా తేడావస్తే వెంటనే లైసెన్స్ సస్పెండ్ చేయాలని సూచించారు. రోజువారీ తనిఖీలను 15 నుంచి 20 వరకు పెంచేలా అధికారులు చొరవ చూపాలన్నారు. వీధి వ్యాపారులు ఒకసారి కాచిన నూనెను తిరిగి వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెండర్లు వాడే ఆయిల్ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు.
పుడ్ లైసెన్సు లేని హోటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజా సూచించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు శుభ్రతపట్ల పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న కొన్ని షాపులు,హోటళ్లలో రెయిడ్ చేసి వారిపై లైసెన్స్ రద్దుచేసి కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఓ ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు.