BWF World Championships 2022: ప్రపంచ ఛాంపియన్‌షిప్ బరిలో దిగేదెవరు! పతకాలు తెచ్చేదెవరు!
BWF World Championships 2022: 27 మందితో కూడిన భారత బృందం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు వెళ్తోంది. మరి ఇందులో గెలిచే సత్తా ఉన్నవాళ్లెవరు? గతంలో వారి అత్యుత్తమ ప్రదర్శన ఏంటి?
BWF World Championships 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు మరో నాలుగు రోజులే ఉంది. టోక్యో వేదికగా జరిగే మెగా టోర్నీలో రాణించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. కామన్వెల్త్ ప్రదర్శననే పునరావృతం చేయాలని పట్టుదలగా కనిపిస్తోంది. 27 మందితో కూడిన భారత బృందం జపాన్‌కు వెళ్లనుంది. మరి ఇందులో గెలిచే సత్తా ఉన్నవాళ్లెవరు? గతంలో వారి అత్యుత్తమ ప్రదర్శన ఏంటి?
సింధు దూరం
చరిత్రలో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు జపాన్ ఆతిథ్యం ఇస్తోంది. 46 దేశాల నుంచి 364 మంది అథ్లెట్లు ఐదు విభాగాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి 27 మంది సభ్యుల బృందం అక్కడికి వెళ్తోంది. అందులో ఏడుగురు షట్లర్లు సింగిల్స్‌లో పోటీపడతారు. పది జంటలు డబుల్స్ మ్యాచులు ఆడతాయి. ఈ మధ్యే ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఏకంగా మూడు విభాగాల్లో స్వర్ణాలు అందుకుంది. మొత్తంగా ఐదు పతకాలు సొంతం చేసుకోవడం షట్లర్లకు ప్రేరణగా మారింది. మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు గాయంతో తప్పుకోవడం పెద్ద లోటే!
లక్ష్యంపై గురి పెడితే
భారత యువ కెరటం లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో ఆశలు రేపుతున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో పతకం పట్టేసేలా కనిపిస్తున్నాడు. తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది మహామహులనే జడిపిస్తూ కాంస్యంతో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా బంగారు పతకం ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. కామన్వెల్త్‌లో స్వర్ణం కొల్లగొట్టిన అతడు ఏకాగ్రతతో ఆడితే అసాధ్యమేమీ కాదు.
మిర్చీ ఘాటు కావాలి
బ్యాడ్మింటన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు కానీ అతడు ఫామ్‌లో ఉంటే ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. అతడి స్మాష్‌లకు ఎవ్వరైనా బెంబేలెత్తాల్సిందే. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన గుంటూరు కుర్రాడు ఈ సారి స్వర్ణం కోసమే ప్రయత్నిస్తాడు. సుదీర్ఘ కాలంగా ఫిట్‌నెస్ ఇబ్బందులు ఎదుర్కోవడం మైనస్ పాయింట్. అయితే కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచి తనేంటో మరోసారి నిరూపించాడు.
సైనా నెహ్వాల్ నిలబడితే
భారత్‌లో అమ్మాయిలు బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతున్నారంటే అందుకు ప్రధాన కారణం సైనా నెహ్వాల్! ఒకప్పుడు షటిల్ కాక్‌తో అద్భుతాలు చేసిన ఆమె కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో సతమతం అవుతోంది. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటోంది. రెండుసార్లు కామన్వెల్త్‌లో పతకాలు గెలిచిన ఆమె ఇదే కారణంతో బర్మింగ్‌హామ్‌కు దూరమైంది. 2017 ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్యం ప్రేరణతో ఈ ఏడాది టోక్యోలో పతకం బరిలో నిలిచింది.
ఫోకస్ షిప్ట్ చేసిన జోడీ
అభిమానులు మొన్నటి వరకు సింగిల్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవారు. వారి దృష్టిని అమాంతం తమవైపుకు తిప్పేసుకున్నారు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ ద్వయాలకు వీరిద్దరూ చుక్కలు చూపిస్తున్నారు. కీలకమైన టోర్నీల్లో సెమీస్, ఫైనళ్లు చేరుకొని దుమ్మురేపుతున్నారు. కామన్వెల్త్‌లోనూ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచేశారు. ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం అందుకోవాలని తహతహలాడుతున్నారు.