Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telugu Desam Social Media : క్రమశిక్షణ కలిగి కార్యర్తలుగా పేరు ఉన్న పసుపు దళం కొన్ని విషయాల్లో కట్టుతప్పుతోంది. సోషల్ సైన్యం హైపర్ యాక్టివ్ వల్ల టీడీపీ హైకమాండ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Telugu Desam Social Media : సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీపై మాటల దాడులతో పార్టీలు యాక్టివ్‌గా ఉంటాయి. కానీ ఏపీలో అధికార పార్టీ టీడీపీ మాత్రం హైపర్ యాక్టివ్. ప్రత్యర్థులపై దాడుల కంటే.. సొంత పార్టీ నాయకత్వంపై ఎక్కువ ఎటాక్ చేస్తుంటుంది. అలా చేసే పరిస్థితి పార్టీ కల్పించిందా.. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారా అన్నది ఎప్పటికీ తెగని ఇష్యూ..
#Hidden Agenda @TDP సోషల్ మీడియా నిండా… !
తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఊహించని షాక్ మొదలైంది. గడచిన ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని .. ఎదురొడ్డి పార్టీని నిలిపామని భావిస్తున్న హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు.. కూటమి ప్రభుత్వం తప్పు చేయడానికి వీల్లేదని భావిస్తున్న పార్టీ మేధావులు, దెబ్బకు దెబ్బ తీయాలని కసి మీదున్న తెలుగు తమ్ముళ్లు.. వీళ్లంతా కూడా కొంచం యాక్టివ్‌గానే ఉంటున్నారు. దాదాపు ౩౦ ఏళ్లుగా చంద్రబాబు మాటే శాసనంగా నమ్ముతూ వస్తున్న తెలుగు తమ్ముళ్లు కాస్త కట్టుతప్పుతున్నారు. అది తప్పేం కాదు.. మా హక్కు అని కూడా వాదిస్తున్నారు. ఇంత వరకూ వారి ఎమోషనే్ను అర్థం చేసుకోవాలి.
టీడీపీలో ఇప్పాల నిప్పు
ఇది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, యాక్టివిస్టు అయిన ఇప్పాల రవీందర్‌రెడ్డి తాను పనిచేస్తున్న సిస్కో సంస్థ ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందం సమయంలో ఆ సంస్థ ప్రతినిధి బృందంతో కలిసి లోకేష్ ను కలవడం అగ్గి రాజేసింది. ఆ ఫోటోలు వచ్చిన క్షణాల్లోనే అతనెవరో పసిగట్టిన టీడీపీ సోషల్ మీడియా రచ్చ చేసింది. తాము క్షణాల్లో గుర్తించిన రవీందర్ రెడ్డిని మంత్రి లోకేష్ టీమ్ ఆ మాత్రం చూసుకోలేకపోయిందా పోయిందా అని సోషల్ మీడియాలో సౌండ్ పెంచింది. ప్రత్యర్థి పార్టీలను ఇష్టపడేవాళ్లు ఉండకూడదా.. ఆ మాత్రం దానికే అంతలా అదిరిపడాలా అనుకోవడానికి లేదు. టీడీపీ వాళ్ల సోషల్ మీడియా అపోనెంట్ లిస్టు తీస్తే మొదటి ఐదు పేర్లలో ఉండేది రవీంద్ర రెడ్డి ఇప్పాల పేరు. అంత ముఖ్యమైన శత్రువును ఏకంగా లోకేష్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారా అన్నది వాళ్ల కడుపు మంట. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ.. అంతకు ముందు కానీ.. టీడీపీ మీద అతను సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారం ఆ స్థాయిలో ఉంది మరి… నేను ఇక్కడ ప్రస్తావించలేని.. మాట్లాడలేని భాషలో ఆ పోస్టులున్నాయి. ఇప్పటికే అరెస్టు చేయాల్సినటు వంటి వ్యక్తిని ఆ పని చేయకుండా పిలిచి మర్యాదలు చేస్తారా అని వాళ్ల గొడవ. దాంట్లో అర్థం ఉంది. అయితే లోకేష్ టీమ్ చెబుతోంది ఏంటంటే..
సిస్కో టీమ్ లో వచ్చే మనుషులు తమకెలా తెలుస్తారు.. అతన్ని లోకేష్ కానీ.. మిగిలిన వాళ్లు కానీ ఎలా గుర్తుపట్టగలుగుతారు.. ? ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పాల్సింది పోయి పబ్లిగ్‌గా యాగి చేయడం ఏంటని వాళ్లు అడుగుతున్నారు. అంతే కాదు విషయం తెలిసిన వెంటనే రవీందర్‌రెడ్డిని ప్రాజెక్టులో ఏ విధంగానూ భాగస్వామిని చేయొద్దంటూ CISCO కు చెప్పేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. పార్టీపైన సెటైర్లు.. విరుపులు, చెణుకులు ఆగలేదు.. అప్పుడు మొదలైంది ఇంకో రగడ.. అదేంటంటే..
#Hidden Agenda
రవీందర్ రెడ్డి ఇష్యూలో వచ్చిన నెగటివిటీపై పార్టీ టీమ్‌లోనే కొంతమంది నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. పార్టీకి సపోర్టు చేస్తూనే సోషల్ మీడియాలో ఓపెన్‌గా ఉండే వాళ్లకు పార్టీకి హార్డ్‌కోర్ లాయల్‌గా ఉండేవాళ్ల నుంచి ఎదురు సమాధానం మొదలైంది. ఇన్నాళ్లు ఓపికగా ఉన్నాం… మీరు పార్టీని దెబ్బతిస్తున్నారు .. Hidden Agendaతో కొంతమంది నష్టం చేస్తున్నారు అంటూ ఎదురుదాడి చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని చంద్రబాబుకు, లోకేష్‌కు ముడిపెడుతూ పార్టీని దెబ్బతీస్తున్నారన్నది వారి వాదన. ఈ విషయంలో కూడా లోకేష్ టీమ్ క్షణాల్లోనే తప్పును సరిదిద్దిందని అయినా కూడా ఇంకా ఏదో ఆశించి కొంత మంది ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇది
వివాదాన్ని మరింత పెంచింది.
పార్టీపై అభిమానంతో నిస్వార్థంగా పనిచేసే తమపై నిందలేంటన్నది మొదటి బ్యాచ్ అంతరంగం. మీరు చేసే పనితో పార్టీకే నష్టం అన్నది రెండో బ్యాచ్ అభ్యంతరం. ఇది ఇప్పట్లో తేలేది కూడా కాదు. పార్టీకోసం డబ్బును, సమయాన్ని వెచ్చించడంతోపాటు బోనస్‌గా కేసులు, వేధింపులు ఎదుర్కొన్న తమకు పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉందని.. పార్టీని విమర్శించే హక్కు కూడా ఉందని వాళ్ల వాదన.
ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచే తెలుగుదేశంలో అసంతృప్తి స్వరం మొదలైంది. వాళ్లు కోరుకున్నంత వేగంగా ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవడం లేదన్నది వీళ్ల బాధ. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినవాళ్లు మొదలుకుని.. అవినీతిలో పేట్రేగిన వారి వరకూ అందరి భరతం పట్టేయాలన్నది వీళ్ల ఆలోచన. తెలుగుదేశం పార్టీ అవసరాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వాళ్ల ఆక్షేపణ. వైసీపీకి అనుకూలంగా ఉన్న సంస్థలకే కాంట్రాక్టులు, టీడీపీ వాళ్లని వేధించిన పోలీసులకు మంచి పోస్టింగులు ఇవన్నీ టీడీపీ కార్యకర్తల కోపాన్ని మరింత పెంచాయి. జీవీ రెడ్డి ఎపిసోడ్‌లో అది పీక్స్ కు వెళ్లింది. ఆ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్న ఆవేశాన్ని పార్టీ నాయకత్వం కొంచం గుర్తించింది. మళ్లీ పుంగనూరులో కార్యకర్త రామకృష్ణ మరణం.. రవీందర్‌రెడ్డి అంశాలతో వాళ్లు పార్టీని నిలదీస్తూనే ఉన్నారు.
నేను మామూలుగా అన్ని పార్టీల సోషల్ మీడియా ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటాను. ఈ రెండు వాదనలు కాకుండా మధ్యే మార్గం చూస్తున్న ఓ వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే.. అసలు లోకేష్ – రవీందర్ రెడ్డి ఎపిసోడ్ కనుక రివర్స్‌లో వైసీపీ టైమ్ లో జరిగి ఉంటే.. అంటే.. ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త.. రవీందర్ రెడ్డి లాగా CISCOలో మంచి స్థానంలో ఉండి జగన్ ను కలవడానికి వెళ్లి ఉంటే.. అతన్ని ట్యాగ్ చేస్తూ.. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఓకే వాయిస్‌పైకి వచ్చేది అదేంటంటే.. టీడీపీకి చేతకానిది జగన్ సాధించిపెట్టాడు అనే క్యాంపెయిన్‌ను రన్ చేసి ఉండేవాళ్లు. టీడీపీకి ఆ చాన్స్ వచ్చినా వాళ్లలో వాళ్లు గొడవపడుతూ వదులుకున్నారు..అని.. ! మరిప్పటికైనా వాళ్లు తెలుసుకుంటారో లేదో..
కొంతమంది తమ్ముళ్లు మాత్రం తాము తెలుగుదేశమే.. అయినా తగ్గేదేలే అంటున్నారు. ఇది టీడీపీలో ఇంతకు ముందు లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు, లోకేష్ చేసే అన్ని పనులను తాము సమర్థించం అంటూ చేస్తున్న తిరస్కృతి. దీనికి ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న పార్టీ తరుపు వ్యక్తులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. ఇది సమస్యకు చికిత్స అవుతుందా.. వికటిస్తుందా.. అన్నది చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

