Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
Telangana Assembly: తెలంగాణలో ఉపఎన్నికలు రానే రావని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సీఎం ప్రకటన ఆసక్తికరంగా మారింది.

No ByElections: తెలంగాణలో ఉపఎన్నికలు వచ్చే అవకాశాలులేవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటన వారిలో ధైర్యం నింపుతోంది.
అప్పట్లో రాని ఉపఎన్నికలు .. ఇప్పుడెలా ?
ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదని.. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామని గుర్తు చేశారు. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు.. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందన్నారు. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం.. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు..ఇక మీపై మాకు కోపం ఎందుకు ఉంటుందిని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
ఏప్రిల్ రెండో తేదీన సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ
ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశంపై ప్రతివాదులు ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసి .. ఏప్రిల్ రెండో తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్కాఖ్యలు చేసింది. సభ్యుల రాజీనామాలు లేదా అనర్హతా వేటు అంశంలో స్పీకర్ కు నిర్దిష్టమైన గడవు విషయంలో గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు తీర్పులు ఇచ్చాయని వాటిని కాదని తామెలా తీర్పు ఇవ్వగలమని ప్రశ్నించింది.
దానం కాంగ్రెస్ తరపున లోక్ సభకు పోటీ చేయడంపై కొత్త చర్చ
అదే సమయంలో దానం నాగేందర్ అంశాన్ని బీఆర్ఎస్ నేతల తరపు లాయర్లు ప్రస్తావించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌లో చేరడమే కాదు.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఫిరాయింపుల విషయంలో ఏదో ఒకటి చేయాల్సిందేనన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. తదుపరి విచారణలో పార్టీ ఫిరాయించారని భావిస్తున్న ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేయనున్నారు.
పార్టీ మారలేదని సుప్రీంలో అఫిడవిట్లు వేస్తున్న ఎమ్మెల్యేలు
అయితే వీరిలో ఎక్కువ మంది తాము పార్టీ ఫిరాయించలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు విషయంలో అనర్హత వేటు వేసే అధికారం ఒక్క స్పీకర్ కే ఉంటుందని అందుకే ఉపఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావని ధీమాగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















