Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Betting App Cases: బెట్టింగ్ యాప్స్ బెండు తీస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు. నమోదైన కేసుల విచారణ పరిగెత్తించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Telangana CM Revanth Reddy Warning To Betting Apps: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్‌పై సీరియస్‌గా ఉంది తెలంగాణ ప్రభుత్వం. వీటిపై కన్నెర్ర చేసేందుకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బెట్టి యాప్‌లు నిర్వహించినా, ఆడినా, ఆడించినా ప్రమోట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వీటిని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సినీ సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసింది. వారి కొందరు విచారణకు హాజరై ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
బెట్టింగ్ యాప్స్ మూలాలపై గురి పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం మూలాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా నిర్వాహకుల వివరాలపై ఆరా తీస్తున్నారు. వాటిని నేలకూలిస్తే తప్ప ఈ మహమ్మారి నుంచి విముక్తి లభించదని భావిస్తోంది. మత్తుపదార్థాలకు బానిసలు అవ్వొద్దనే ఇప్పటి వరకు ప్రచారం చేస్తూ వచ్చాయి ప్రభుత్వం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయీ బెట్టింగ్ యాప్స్. ఎక్కువ మంది యువకులే ఈ దందాలో చిక్కుకొని అప్పులుపాలవుతున్నారు. వాటిని తట్టుకోలేక కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఇంకొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్స్‌పై వేసే సిట్‌లో ఎవరెవరు ఉంటారు?
ప్రభుత్వం ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అందులో ఎవరెవరు ఉంటారనే ఆసక్తి ఉంది. సిట్‌కు ఎలాంటి రూల్స్ ఉంటాయి. ఏ దిశలో కేసును తీసుకెళ్లనున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాలపరిమితి ఏమైనా విధిస్తారా అన్నది కూడా తెలియాలి. బెట్టింగ్ యాప్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు రేవంత్‌రెడ్డి. యాప్‌లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా వాటిని ప్రోత్సహించే వారిని కూడా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.
బెట్టింగ్ యాప్స్‌ను సినిమా, టీవీ, యూట్యూబ్ సెలబ్రెటీలు చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్లందరిపై కేసులు నమోదు అయ్యాయి. అగ్రనటులు కూడా ఈ కేసుల వలయంలో చిక్కుకున్నారు. ఈ లిస్ట్ పెరిగిపోవడంతో ప్రభుత్వం రూట్ మార్చింది. ప్రమోట్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండటం లేదని గ్రహించింది. అందుకే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పని పట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలువురును గుర్తించింది. త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
డ్రగ్స్ సిట్ మాదిరిగా అయితే కాదు కదా
సిట్‌లు ఏర్పాటు చేయడం ప్రభుత్వాలకు రివాజుగా మారిపోతోంది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై కూడా ప్రభుత్వాలు సిట్‌లు వేశాయి. కొందరు సెలబ్రెటీలను పిలిచి విచారించాయి. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన మొదట్లో హడావుడి చేసింది. కానీ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. ఆ కేసు ఏమైందో పత్తా లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌పై వేసే సిట్ కూడా అదే దారిలోకి వస్తుందా అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది.





















