Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Aravalli mining: ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వతాల్లో 90 శాతం పర్వతాల కేటగిరీలోకి రావని కేంద్రం తేల్చేసింది. అక్కడ మైనింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Aravalli Is In Spotlight : ఆరావళి పర్వతాలు.. ఇప్పుడీ అంశం పర్యావరణ వేత్తలకు ఆందోళనలకు కీలక ఆధారంగా మారింది. ప్రభుత్వ కొత్త నిబంధనలు మరియు మైనింగ్ వల్ల ఆరావళికి ముప్పు పొంచి ఉందన్న వార్తలతో సోషల్ మీడియాలో ఈ ఉద్యమం ఉధృతమైంది. పర్వతాల ఎత్తుతో సంబంధం లేకుండా, ఆరావళి శ్రేణిలోని ప్రతి కొండను 'రక్షిత అడవి'గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ వాసులు తమ 'గ్రీన్ లంగ్స్'ను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తున్నారు. ఆరావళి అంతరిస్తే థార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరిస్తుందని, రాజస్థాన్ నుంచి వీచే వేడి గాలులు దేశ రాజధానిని దహించివేస్తాయని ఈ క్యాంపెయిన్ ద్వారా హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఆరావళి పరిరక్షణపై గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టు వరుస విచారణలు చేపట్టింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టడంలో విఫలమైనందుకు రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాస్త్రీయంగా పర్వతాల సరిహద్దులు నిర్ధారించే వరకు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అది పర్వతం కాదు అనే వాదనను కోర్టు గుడ్డిగా అంగీకరించలేదు. కొన్ని షరతులు పెట్టింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా ఏ నిర్ణయం ఉండకూడదని తేల్చి చెప్పింది. మైనింగ్ వల్ల ఇప్పటికే మాయమైన 31 కొండల విషయంలో కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతాల్లో తిరిగి అడవులను పెంచాలని ఆదేశించింది. ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణ రక్షణే ప్రాధాన్యతని, ఆరావళి ధ్వంసమైతే ఉత్తర భారత దేశానికి నీటి ఎద్దడి మరియు ఎడారీకరణ ముప్పు తప్పదని హెచ్చరించింది.
కేంద్రం ఏం చెబుతోంది?
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల పర్వతాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. 100 మీటర్లు అంటే సుమారు 328 అడుగులు కంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని పర్వతాలుగా పరిగణించలేమని పేర్కొంది. దీనివల్ల ఆరావళిలోని 90 శాతం చిన్న కొండలు రక్షణ పరిధిని కోల్పోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే రాజస్థాన్ మరియు హర్యానాలో దాదాపు 31 కొండలు మాయమైపోయాయని గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కొత్త నిర్వచనం వల్ల మిగిలిన కొండలు కూడా మైనింగ్ కంపెనీల పరమవుతాయని సేవ్ ఆరావళి ** పేరిట నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆరావళి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సైంటిఫిక్ మ్యాపింగ్ పూర్తయ్యే వరకు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వకూడదని స్పష్టం చేస్తూనే, ప్రభుత్వం సూచించిన 100 మీటర్ల ఎత్తు నిబంధనను కొన్ని షరతులతో పరిగణనలోకి తీసుకుంది. ఒకవేళ ఆరావళి పర్వతాలు ధ్వంసమైతే ఉత్తర భారతదేశం ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వర్షపాతం తగ్గడం, వేడి పెరగడం,వన్యప్రాణుల ఆవాసాలు కనుమరుగవడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
హిమాలయాలకన్నా పురాతనమైనవి ఆరావళి
ఆరావళి పర్వతాలు సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని చెబుతారు. ఇవి హిమాలయాల కంటే చాలా పురాతనమైనవి. ప్రపంచంలోని పురాతన మడత పర్వత వ్యవస్థలలో ఒకటి. ఇవి గుజరాత్‌లో ప్రారంభమై రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. థార్ ఎడారిలోని ఇసుక తుఫానులు మరియు ఎడారి విస్తరణ గంగా మైదాన ప్రాంతాలైన ఢిల్లీ, యూపీ వ్యాపించకుండా ఇవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఢిల్లీ-NCR వంటి అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలకు ఇవి 'గ్రీన్ లంగ్స్' లాంటివి. ఇవి గాలి నాణ్యతను పెంచడమే కాకుండా భూగర్భ జల మట్టాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పర్వతాలు రాగి, జింక్, సీసం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మకరానా పాలరాయి వంటి ఖనిజాలకు నిలయం. తాజ్ మహల్ నిర్మాణానికి వాడిన రాయి కూడా ఇక్కడిదే. అందుకే మైనింగ్ మాఫియా దృష్టి ఈ పర్వతాలపై ఉంది. వాటిని కాపాడాల్సిన కేంద్రం రూల్స్ మార్చి.. సహకరిస్తోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది.





















