Balapur Ganesh 2024: అయోధ్య మందిరంలో బాలాపూర్ వినాయకుడు - ఈ సారి వేలంలో లడ్డూ ధర ఎంత పలుకుతుందో!
Ganesh Chaturthi 2024: హైదరాబాద్ బాలాపూర్ వినాయకుడు ఈ సారి అయోధ్య రామ మందిరంలో కొలువుతీరనున్నాడు. ప్రముఖ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు ఉత్సవ సమితి...
Balapur Ganesh 2024: బాలాపూర్ వినాయక మండపాన్ని ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే బాలాపూర్ లో అయోధ్య నమూనా సిద్ధం కావడంతో...వారం ముందునుంచే అక్కడ భక్తుల సందడి పెరిగింది. సెల్ఫీలు తీసుకుంటూ అయోధ్య ఆలయ పరిసరాల్లో ఉన్నట్టే భావిస్తున్నారు..గతేడాది బెజవాడ దుర్గమ్మ ఆలయ నమూనా ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఏడాది అయోధ్య రామాలయ నమూనాను దించేసింది
వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బాలాపూర్ వినాయకుడు. నగరంలో బాలాపూర్ గణేష్ యాత్ర మొదలైన తర్వాతే భాగ్యనగరంలో మిగిలిన మండపాలనుంచి గణనాథుడు తరలివెళతాడు. బాలాపూర్ గణేష్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే లడ్డూ వేలం. ఏటికేడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోన్న లడ్డూ వేలం..ఈ ఏడాది ఎంత ధర పలుకుతుందో అని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చివరి పూజ జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించే ఉత్సవసమితి..బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహిస్తుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూ దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు. ముందుగా కొంత మొత్తం డిపాజిట్ చేసినవారికి మాత్రమే వేలంపాటలో పాల్గొనే అవకాశం ఇస్తుంది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు..
Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
లడ్డూ వేలంకి ఆద్యుడు బాలాపూర్ గణేషుడు
బాలాపూర్ గణేషుడి లడ్డూ బరువు 21 కిలోలు.. చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే అసలు లడ్డూ వేలాన్ని ప్రారంభించిందే బాలాపూర్ గణనాథుడి దగ్గరే. లంబోదరుడికి లడ్డూ నైవేద్యంగా పెట్టే సంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది కానీ...1994 నుంచి వేలం పాట నిర్వహించడం మొదలుపెట్టారు. మొదటిసారిగా కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు ఆ లడ్డూ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా ఆయనే రూ.4,500కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరాల్లోనూ 18వేలు, 28 వేలు, 51 వేలకు వేలంలో లడ్డూ కొనుగోలు చేశాడు. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు..2000 లో అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూ కొనుగోలు చేశారు. ఆ తర్వాత గల్లీల్లో గణనాథుడి మండపాల దగ్గర కూడా లడ్డూ వేలం నిర్వహిస్తూవస్తున్నారు.
2002 లో లక్ష దాటిన లడ్డూ ధర
2002 లో మొదటిసారిగా బాలాపూర్ గణేషుడి లడ్డూ ధర లక్ష దాటింది... కందాడ మాధవ రెడ్డి కొనుగోలు చేశారు. 2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలకు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల వెయ్యి రూపాయలకు వేలం పాడారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకోగా… 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి 3లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏటికేడు వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది.
Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
2007లో 4 లక్షల 15 వేలు, 2008లో 5లక్షల 7వేలు, 2009లో 5లక్షల 15వేలు, 2010లో 5లక్షల 35వేలు, 2011లో 5 లక్షల 45వేలు పలికింది. 2012 నుంచి ఆ ధర 7 లక్షలు దాటింది. ఆ ఏడాది 7లక్షల 50వేలు, 2013లో 9లక్షల 26వేలు, 2014లో 9లక్షల 50వేలు, 2015లో 10 లక్షల 32వేలు, 2016లో 14లక్షల 65వేల, 2017లో 15లక్షల 60వేలు, 2018లో 16లక్షల 60వేలు, 2019లో 17లక్షల 67వేలు ధర పలికింది..
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవసమితి. 2021 లో 18 లక్షల 90 వేలు పలికింది. 2022 లో 24 లక్షల 60 వేలు, 2023 లో 27 లక్షలు ధర పలికింది. మరి ఈ ఏడాది బాలాపూర్ గణేషుడి లడ్డూ ధర 30 లక్షలకు చేరుతుందేమో చూడాలి..
ఏటా ఏడాది గణేష్ వేలం పాట ద్వారా వచ్చే సొమ్మును పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకూ లడ్డూ దక్కించుకున్న వారి వివరాలను, ఎంతకు కొనుగోలు చేశారో ఫ్లెక్లీలు ఏర్పాటు చేసే బాలాపూర్ ఉత్సవ సమితి.. తద్వారా వచ్చిన సొమ్ముతో ఏం చేశారో కూడా స్పష్టంగా వెల్లడిస్తూనేఉన్నారు. వివిధ ఆలయాల అభివృద్ధితో పాటూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఆ డబ్బులు వినియోగిస్తున్నారు.
Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!