Ganesh Chaturthi 2024 Shubh Muhurat : వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
Ganesh Chaturthi 2024 : సెప్టెంబరు 07 శనివారం వినాయకచవితి..ఈ రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి, శుభముహూర్తం ఏంటి?.. నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకూ...ఈ కథనంలో తెలుసుకుందాం...
Ganesh Chaturthi 2024 Puja Shubh Muhurat and Ganesh Visarjan Date
శ్లోకం
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ!
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!!
గణపయ్య కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు..ఘనమైన భగవంతుడు. చిన్నా పెద్దా అందరూ మెచ్చే దైవం. ఈ సష్టి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది..ఆ గణాలను శాసించే మహా శక్తిమంతుడు లంబోదరుడు. అందుకే ఏది ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ ఎలాంటి గణాలు అడ్డుతగలకూడదని భావించి..గణపతిని పూజిస్తారు. ఈ ఏడాది (2024) వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకూ..చవితి రోజు పూజ చేసుకునేందుకు శుభ ఘడియలేంటి...
Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!
వినాయక చవితి పూజా ముహూర్తం (2024 Ganesh Chaturthi date and puja time)
2024 సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి వచ్చింది. అయితే వాస్తవానికి చవితి ఘడియలు సెప్టెంబరు 06 శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 06 శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల 51 నిముషాల నుంచి చవితి ఘడియలు మొదలయ్యాయి... సెప్టెంబరు 07 శనివారం మధ్యాహ్నం 1.50 నిముషాల వరకూ ఉన్నాయి. సాధారణంగా సూర్యోదయానికి తిథి ఎప్పుడుంటే ఆ రోజునే పండుగ చేసుకుంటారు కాబట్టి వినాయకచవితి పూజ సెప్టెంబరు 07 శనివారం చేస్తారు.
మండపాల్లో గణపయ్య కొలువుతీరేందుకు చాలా సమయం పడుతుంది. సెప్టెంబరు 07 శనివారం మధ్యాహ్నం వరకే చవితి ఘడియలున్నాయి..అంటే మండపాలకు విగ్రహాలు చేరి పూజ ప్రారంభించే సమయానికి చవితి పోయి పంచమి మొదలవుతుంది. అందుకే సాయంత్రం సయానికి వినాయక పూజ చేసేమండపాల్లో ముందురోజైన సెప్టెంబరు 06 శుక్రవారం సాయంత్రం చవితి ఉన్న సమయంలో తొలి పూజ చేసేస్తారు...ఇక మర్నాడు పూజ ఆలస్యం అయినా పర్వాలేదన్నది కొందరి అభిప్రాయం.
చవితి రోజు ఇంట్లో పూజ చేసుకునేవారికి ఏ సమయం మంచిదంటే...ఆ రోజు ఉదయం ఏడున్నర గంటలవరకూ దుర్ముహూర్తం ఉంది.. ఆ సమయం దాటిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా వినాయక పూజ చేసుకోవచ్చు..
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
నవరాత్రులు ప్రారంభ - ముగింపు (2024 Ganesh Visarjan Date)
సెప్టెంబరు 07న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులు...సెప్టెంబరు 16 తో ముగుస్తాయి. సెప్టెంబరు 6 సాయంత్రమే మండపాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసేవారు సెప్టెంబరు 15 నే నిమజ్జనం చేసేస్తారు. ఇంకా మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మి రోజులు, పదకొండు, ఇరవై ఒక రోజులు ఇలా ఎన్ని రోజులు మండపాల్లో విగ్రహాలు ఉంచాలన్నది ప్రాణప్రతిష్ట చేసిన వారి ఇష్టం...
గణేశ ద్వాదశనామ స్తోత్రమ్
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||
అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||
గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||
విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||
|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్