Gaza News: గాజాపై దాడులు ఆపేయాలంటూ మేక్రాన్ సూచన, గట్టి బదులిచ్చిన నెతన్యాహు
Israel Gaza Attack: గాజాపై దాడులను ఆపేయాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ పిలుపునిచ్చారు.
Israel Gaza War:
మేక్రాన్ వ్యాఖ్యలు..
Gaza News: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంపై (Israel Hamas War) స్పందించారు. ఇజ్రాయేల్ తక్షణమే గాజాపై దాడులను ఆపేయాలని పిలుపునిచ్చారు. పౌరులను బలి తీసుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి సరైన కారణమేదీ లేదని, దాడులను ఉపసంహరించుకుంటే ఇజ్రాయేల్‌కే మంచిదని సూచించారు. ఇదే సమయంలో హమాస్ చర్యల్నీ తప్పుబట్టారు మేక్రాన్. హమాస్ చేసింది తప్పే అయినా ఇజ్రాయేల్ కారణంగా సాధారణ పౌరులు చనిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
"ఇజ్రాయేల్ దాడుల కారణంగా చాలా మంది సాధారణ పౌరులు బలి అవుతున్నారు. ఇజ్రాయేల్ తమ దాడుల్ని ఏ విధంగానూ సమర్థించుకోడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు ఈ దాడులు ఆపడం ఇజ్రాయేల్‌కే మంచిది. హమాస్ చేసింది మంచే అని మేం చెప్పడం లేదు. హమాస్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయేల్‌కి ఉన్నప్పటికీ సాధారణ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునైనా దాడులను తక్షణమే ఆపేయాలి"
- ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
స్పందించిన నెతన్యాహు..
అమెరికా, బ్రిటన్ కూడా ఇజ్రాయేల్ వెంటనే యుద్ధం ఆపేలా చొరవ చూపించాలని కోరారు మేక్రాన్ (Emmanuel Macron). కచ్చితంగా వాళ్లు కూడా చొరవ చూపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే...మేక్రాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ( Benjamin Netanyahu) స్పందించారు. గాజా చర్యల్ని తప్పుబట్టాల్సింది పోయి ఇజ్రాయేల్‌పై నిందలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు హమాస్ చర్యల్ని ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు.
"గాజాలో హమాస్ ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడ్డారు. దాడులు చేశారు. రేపు ఇలాంటి దాడులే పారిస్‌లోనో, న్యూయార్క్‌లోనో జరిగితే పరిస్థితి ఏంటి..? ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇలాంటి దాడులు జరిగితే ఎలా స్పందిస్తారు.."
- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని
అమెరికా దౌత్యవేత్తల అసహనం..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం (Israel Hamas War) విషయంలో ఇజ్రాయేల్‌కి భారీ మద్దతునిస్తోంది అమెరికా. ఈ విషయంలో అరబ్ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు (US Diplomats) తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాదు. అమెరికా ప్రభుత్వాన్ని వాళ్లు హెచ్చరించారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ సపోర్ట్ కారణంగా అరబ్ దేశాల్లోని ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్లమవుతామని వార్నింగ్ ఇచ్చారని CNN తెలిపింది. ఒమన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్తలూ ఇదే హెచ్చరికలు చేశారు. ఇది కూడా యుద్ధ నేరం కిందకే వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఇలా మద్దతునిచ్చి గౌరవం పోగొట్టుకుంటున్నామని మండి పడుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికాకి టెలిగ్రామ్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నికల్‌గా దీన్నే diplomatic cable అని పిలుస్తారు. వైట్‌హౌజ్‌కి చెందిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు CIA,FBIకి ఈ టెలిగ్రామ్ పంపారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని అమెరికన్ ఎంబసీ నుంచి కూడా ఇదే విధంగా హెచ్చరికలు వచ్చాయి. అధ్యక్షుడు బైడెన్ కారణంగానే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. అంతే కాదు. గత అధ్యక్షుల కన్నా బైడెన్ మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు దౌత్యవేత్తలు.
Also Read: Pakistan Fisherman: వలలో చిక్కిన బంగారు చేప, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు