US Fed Decision: వడ్డీ రేట్లు మార్చని అమెరికా కేంద్ర బ్యాంక్, బంగారం ధరలపై ప్రభావం ఎంత?
US Federal Reserve: ట్రంప్ టారిఫ్ ప్లాన్ వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఫెడరల్ రిజర్వ్ ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణ అంచనాను 2.5 శాతం నుంచి 2.8 శాతానికి పెంచింది.

US Fed Decisions Efeect On Gold Rates: అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్' (Federal Reserve), అగ్రరాజ్యంలో వడ్డీ రేట్లను తగ్గించకూడదని మరోమారు నిర్ణయించింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంలో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి 4.25 - 4.50 శాతం వద్దే కొనసాగించింది. ఈ 2025 జనవరిలో జరిగిన FOMC సమావేశంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. దీంతో, 2025లో వరుసగా రెండోసారి US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లయింది.
2025లో రెండు కోతల సిగ్నల్
వాస్తవానికి, యూఎస్ ఫెడ్ నుంచి వడ్డీ రేట్ కోతలు (US Fed rate cuts) ఉంటాయని ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు భావించారు. పాలసీ రేట్లపై 'స్టేటస్ ఖో' నిర్ణయం వారిని కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. మార్చి నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ, 2025లో వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గించే అవకాశం ఉందని సూచించింది. ఇప్పుడు, మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, 2025లో వడ్డీ రేట్లు మరో 50 బేసిస్ పాయింట్లు (అర శాతం లేదా 0.50 శాతం) తగ్గే అవకాశం ఉంది.
ట్రంప్ టారిఫ్‌లపై పావెల్ ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) టారిఫ్ వార్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితిపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీకార సుంకాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. తన ఆందోళనకు అనుగుణంగా, యూఎస్ ఫెడ్, అమెరికాలో ద్రవ్యోల్బణ అంచనాను 2.5 శాతం నుంచి 2.8 శాతానికి పెంచింది. అమెరికా ఆర్థిక వృద్ధి రేటు (US GDP) అంచనాను 2.1 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. తద్వారా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ (Donald Trump Tariff War) అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంత చేటు చేస్తాయో చెప్పకనే చెప్పింది.
ద్రవ్యోల్బణంపై సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడం ఒక సవాలుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (Federal Reserve Chairman Jerome Powell) చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని సర్వేలో తేలిందని, ప్రస్తుత వాణిజ్య విధానం సహా ఇతర కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని పావెల్ వెల్లడించారు.
అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో బూమ్
ఫెడరల్ రిజర్వ్ 2025లో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించగలదు అన్న సిగ్నల్స్ రావడంతో, US స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన బూమ్ కనిపించింది, మార్కెట్ భారీ లాభంతో ముగిసింది. ఇది ఆసియా మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.
బంగారం ధరలపై ప్రభావం ఎంత?
యూఎస్ ఫెడ్ ఈ సమావేశంలో పాలసీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ, ఈ ఏడాదిలో రెండు కోతలు ఉండొచ్చని సిగ్నల్ ఇవ్వడంతో, గ్లోబల్ గోల్డ్ మార్కెట్ స్థిరంగా ఉంది. బంగారం రికార్డ్ స్థాయిలో కదులుతోంది. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి రేటు రికార్డ్ స్థాయిలో 3058 డాలర్ల వద్ద ఉంది. సమీప భవిష్యత్‌లో వడ్డీ రేట్లలో కోతలు ఉంటాయన్న అంచనాలతో మదుపర్లు గోల్డ్‌కు డిమాండ్ పెంచుతున్నారు. ఈ డిమాండ్ ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పైనా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

