Sheikh Hasina News: దేశం విడిచిపెట్టి భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని, అక్కడ సైనిక పాలన - త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం!
Bangladesh PM News: బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జామన్ ప్రకటించారు.
Bangladesh Latest News: బంగ్లాదేశ్ లో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భారత్‌కు చేరుకున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్ కు చెందిన ఓ మిలిటరీ హెలికాప్టర్‌లో త్రిపుర రాజధాని అగర్తలకు షేక్ హసీనా చేరుకున్నట్లుగా జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుపై బంగ్లాదేశ్ మొత్తం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా జరుగుతున్న అల్లర్లలో ఇప్పటికే 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాని నివాసానికి భారీగా నిరసన కారులు చేరుకొని షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించారు. దీంతో ముందే షేక్ హసీనా అంతకుముందే తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారు.
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధింపు
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధిస్తున్నట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జామన్ ప్రకటించారు. తాము శాంతి భద్రతలను అదుపులోకి తెస్తామని చెప్పారు. తాను పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలంతా సంయమనం పాటించాలని ఆ దేశ అధికారిక మీడియా ద్వారా వెల్లడించారు.