TGPSC: ‘గ్రూప్-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చే'సిన అభ్యర్థులు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. టీజీపీఎస్సీ(TGPSC)కి నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టు బాటపట్టారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. అలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరీక్షలు రాసినవారిలో మొత్తం 31,403 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపికకాగా.. 21,093 మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఇంగ్లిష్‌తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహించారు. అయితే, వీటిలో ఇంగ్లిష్ పరీక్షను మాత్రం కేవలం క్వాలిఫై టెస్టుగా నిర్ణయించారు. దీంట్లో క్వాలిఫై అయితేనే.. మిగిలిన ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంగ్లిష్‌లో జనరల్ కేటగిరీల అభ్యర్థులకు 40 శాతం; బీసీలకు 35 శాతం; ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్లు. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకే మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించి 900 మార్కులకు గానూ.. వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. అయితే వీరితోపాటు హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేశారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను రూపొందించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

