Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Vidadala Rajini చిలకలూరిపేట లో మాజీ మంత్రి vs తాజా ఎంపీ.. విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు మధ్య గొడవ ఏంటి ?

TDP MP Krishnadevarayulu | చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని, నరసరావుపేట టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య పరస్పర ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా మొన్న విడదల రజిని తన నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ACB కేసులు నమోదు చేసింది. రేపో మాపో విడదల రజని అరెస్టు తప్పదు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై భగ్గుమన్న రజని టిడిపి నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తనపై కక్ష కట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ యజమాని నుండి రెండు కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారనేది ఆమెపై ఉన్న ఆరోపణ.
నా కుటుంబాన్ని కృష్ణదేవరాయులు టార్గెట్ చేశారు : విడదల రజని
మాజీ మంత్రి విడదల రజని చేసిన ప్రధాన ఆరోపణ తన కుటుంబాన్ని ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయులు టార్గెట్ చేశారని తన ఫోన్ కాల్ డేటాను సేకరించే ప్రయత్నం కూడా గతంలోనే చేశారని జర్మనీలో ఉంటున్న తన మరిది ని కూడా కేసుల్లో ఇరికించే కుట్ర జరుగుతుందని. నిజానికి ఒకప్పుడు కృష్ణదేవరాయలు కూడా వైసిపి ఎంపిగానే ఉండేవారు. అప్పటినుంచే వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. 2020లో గురజాల పోలీస్ స్టేషన్లో తనకు అవమానం జరిగిందని దాని వెనక అప్పటి వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయల అధికార దుర్వినియోగం ఉందని రజని ఆరోపించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కృష్ణదేవరాయలు టిడిపిలోకి రావడం నరసరావుపేట ఎంపీగా గెలుపొందడం జరిగిపోయింది. మరోవైపు వైసీపీ ఓటమి పాలయ్యింది. అప్పటినుంచి తనను కేసుల్లో ఇరికించే కుట్రలు ఎక్కువ అవుతున్నాయని విడదల రజని ఆరోపిస్తున్నారు.
విడదల రజనీలా అబద్ధాలు అడడం రాదు: ఎంపీ లావు కృష్ణదేవరాయలు
తనపై విడదల రజని చేసిన ఆరోపణలకు ఢిల్లీలో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనకు బూతులు రావని, మాజీ మంత్రి రజినీలా అబద్దాలు ఆడడం రాదని ఆయన అన్నారు. రజిని కాల్ డేటా సేకరించి ప్రయత్నం తాను చేయలేదని తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని వాళ్ళకో న్యాయం రజనీ కో న్యాయం అంటూ ఉండదని చెప్పుకొచ్చారు. రజినీ మాటలు వెనక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పిన కృష్ణదేవరాయలు ఎవరో స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ కు తనకు సంబంధం ఏంటని అన్నారు. తమ చాలా ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతున్న ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్న సందర్భమే లేదని అన్నారు. పది రోజుల క్రితం విడదల రజని ఒక మధ్యవర్తి ద్వారా కేసులు నుంచి తనని తప్పించమని రాయబారం నడిపిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. స్టోన్ క్రషర్ యజమాని నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజమో కాదో రజిని చెప్పాలని ఆయన అన్నారు.
చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా తనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చట్టం తన పని తాను చేసుకు పోతుందని కృష్ణదేవరాయలు మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. తను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరి పైనా ఎలాంటి విమర్శలు చేయలేదని తనను అనవసరంగా రెచ్చగొట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

