Sharmila Silence: వివేకా హత్య దర్యాప్తుపై షర్మిల సైలెన్స్? సునీత, షర్మిల మధ్య ఏం జరుగుతోంది?
Viveka Murder Case | వివేకా హత్య దర్యాప్తుపై షర్మిల సైలెన్స్? ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది

YS Sharmila Silence in Viveka Murder Case | ఏపీ పీసీసీ చీఫ్ YS షర్మిల మీడియా ముందుకి స్వయంగా వచ్చి రెండు నెలలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఆమెను 60 రోజులుగా చూసింది లేదు. దానితో షర్మిల ఎక్కడ అనే ప్రశ్న ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తోంది. మరోవైపు ఇటీవలే వైయస్ వివేకానంద రెడ్డి ఆరవ వర్ధంతి జరిగింది. ఆ సందర్భంగా కూడా షర్మిల నుండి ఎలాంటి స్పందన వెలువడ లేదు. దానితో అసలు షర్మిల ఎక్కడ ఉన్నారు? ఆమె ఎందుకు ఇంత కీలకమైన ఇష్యూ పై స్పందించలేదు. సునీతకు ఆమెకు మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది
కుమార్తె కోసం విదేశాల్లోనే షర్మిల.. తిరిగి వచ్చేది అప్పుడే
వైయస్ షర్మిల రెడ్డి కుమార్తె విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఆమె అడ్మిషన్ పరంగా తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ ఉంటుంది. దానికోసం షర్మిల రెడ్డి ఆమె భర్త అనిల్ కుమార్ విదేశాల్లోనే ఉంటున్నారు. కూతురి అడ్మిషన్ తో పాటు ఆమెకు తగిన నివాసం ఏర్పాటు చేసి తిరిగి రానున్నారు. మరో రెండు రోజుల్లో అంటే బుధవారం నాడు విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు హాజరు కానున్నారు.
సైలెంట్ అవుతున్న కీలక నేతలు
వైయస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆమెకు పార్టీలోని సీనియర్ నాయకత్వం మనసారా ఆహ్వానం పలికింది. అయితే ఎన్నికల తర్వాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శైలజ నాథ్ లాంటివారు ఇప్పుడు ఆక్టివ్ గా లేరు. వీరిలో రఘువీరారెడ్డి రాజకీయాలు నుండి తప్పుకుంటే శైలజనాథ్ వైసీపీలో చేరిపోయారు. ఇది షర్మిలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. షర్మిల కాంగ్రెస్ లో చేరడం ద్వారా వైసీపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు ఆకర్షతులవుతారు అంటూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. కానీ శైలజ నాథ్ అంశం లో ఇది రివర్స్ లో జరిగింది. దీంతో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను తిరిగి ఉత్తేజ పరచాల్సిన బాధ్యత YS షర్మిలపై ఉంది. ప్రస్తుతం ఆమె ఆ పనిలోనే ఉన్నారని విజయవాడలో ఇల్లు సైతం కొన్నారని షర్మిల వర్గం చెబుతోంది. ఉగాది తరువాత విజయవాడ నుండే ఆమె రాజకీయం జరుపబోతున్నట్టు షర్మిల కార్యవర్గం చెబుతోంది. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చూస్తారు అంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు.
షర్మిల సునీత మధ్య అంతా ఓకేనా?
2024 ఎన్నికలకు ముందు వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై ఏపీ రాజకీయాల్లో ఎంతటి దుమారం రేగింది అందరూ చూసారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి వివేకానంద రెడ్డి హత్య పై చాలా ఆరోపణలు చేశారు. ఈ హత్య కేసులో నిందితులు బయట తిరుగుతున్నారని ఈ హత్య వెనుక ఉన్న అసలు నిజం బయటికి రావాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఎందుకో షర్మిల ఈ అంశంపై సైలెంట్ అయ్యారనే చర్చ రాజకీయాల్లో మొదలైంది. మొన్న 15వ తారీఖున వైయస్ వివేకానంద రెడ్డి ఆరో వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల లోని ఆయన సమాధిని దర్శించి నివాళులు అర్పించిన సునీత తర్వాత విజయవాడలో గవర్నర్ ను కలిసి తన తండ్రి హత్య కేసులో సిబిఐ విచారణ పునః ప్రారంభించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తన తండ్రి హత్య కేసులో సాక్షులు ఒకొక్కరు గా చనిపోవడం పైనా ఆమె సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆరోజు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా సైతం ఎక్కడా స్పందించలేదు. దేనితో వైయస్ సునీత, షర్మిల మధ్య అంతా ఓకేనా అని అనుమానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి అనేక అనుమానాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత షర్మిల పైన ఉంది. మరి YS షర్మిల ఆ దిశగా ఎప్పుడు మీడియా, ప్రజల ముందుకు వస్తారో చూడాలి.





















