Good Samaritan: 5 రెట్లు రివార్డు పెంపు - గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రిలో చేర్పిస్తే రూ.25 వేలు, కేంద్రం కీలక నిర్ణయం
GOVT REWARD: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలిస్తే ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేలు సాయాన్ని రూ.25000కు పెంచనుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Good Samaritan: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రిలో చేర్పిస్తే వారి ప్రాణాలు కాపాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్నే గోల్డెన్ అవర్ (Golden Hour)అంటారు. అంటే ప్రమాదం జరిగిన గంటలోపు ఆస్పత్రిలో చేర్పించాలన్నమాట. కానీ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు జరిగితే చుట్టూ చేరి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారే తప్ప కనీసం సాయం చేయడం లేదు. అంబులెన్స్‌కు(Ambulance) గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వడం లేదు. ఇటీవలే విజయవాడలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ యువకుడి తల్లి కాళ్లావేళ్లా పడి ప్రాథేయపడినా ఎవరూ కనికరం చూపలేదు. ఆ తల్లి కళ్లముందే కుమారుడు ప్రాణాలు వదిలాడు.
పాపం కదా అని సాయం చేస్తే పోలీసులు(Police), కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని... ఆస్పత్రిలో(Hospital) చేర్పిస్తే డబ్బులు కట్టాల్సి వస్తుందన్న భయం వల్లే ఎవరూ ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు రావడం లేదనే భావన ఉంది. ఇకపై ఇలాంటి భయం అవసరం లేదు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్ అవర్‌లోగా ఆస్పత్రిలో చేర్పిస్తే ప్రభుత్వం రివార్డు(Reward) ఇవ్వడమేగాక....ప్రశంసా పత్రం సైతం అందజేయనుంది. ప్రస్తుతం రివార్డు సొమ్ము రూ.5 వేలు ఇస్తుండగా దీన్ని రూ.25 వేలకు పెంచనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) వెల్లడించారు. బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చే వారికి చట్టపరంగానూ రక్షణ కల్పించనున్నారు. ఏటా ఎక్కువ మందిని కాపాడిన వారికి అదనంగా రివార్డు అందజేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గంటలోపు ఆస్పత్రికి తరలించిన తర్వాత.. స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే వారు అధికారిక లెటర్‌ప్యాడ్‌పై మీ వివరాలు, ప్రమాదానికి సంబంధించిన వివరాలతో కూడిన ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. ఆస్పత్రి నుంచీ వివరాలు సేకరించి జిల్లా స్థాయి అప్రైజల్ కమిటీకి పంపితే వారు రవాణా కమిషనర్‌కు సిఫారసు చేస్తారు. ఆ తర్వాత సంబంధిత ప్రాణదాత అకౌంట్‌లో రివార్డు సొమ్ము జమవుతుంది. స్వచ్ఛందంగా సాయం చేసిన వారికి పోలీసు వేధింపులు లేకుండా గుడ్ సమరిటన్ (Good Samaritan)చట్టం రక్షిస్తుంది. ప్రాణదాత ఎటువంటి క్రిమినల్ కేసులకు బాధ్యత వహించాల్సిన పని లేదు. అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసే వారిని వేధింపులు, నిర్బంధం వంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది. దీని ప్రకారం వారు ఎటువంటి పౌర లేదా క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సిన పని లేదు.
వేధింపులు లేవు
క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీసుస్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందనే అపోహను ప్రజలు వీడాలని పోలీసులు చెబుతున్నారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లినా, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా... పోలీసుల నుంచి ఎలాంటి విచారణ ఉండదన్నారు. బాధితులను ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి వెళ్లిపోవచ్చన్నారు. కనీసం వివరాలు కూడా ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఆస్పత్రిల్లో డబ్బులు చెల్లించాలన్న భయం కూడా వీడాలని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా, సాయం పెంపుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎక్కువ మంది ప్రాణదాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.