IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని బీసీసీఐ నిర్ణయించింది. చూసి చూడనట్లుగా వదిలేసిన కొన్ని నిబంధనలను ఫిక్స్ చేసింది. వాటిని అతిక్రమించిన ప్లేయర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా వెల్లడించింది.

BCCI Strict Guidelines: టీమిండియా ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు గాను బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను రూపొందించింది. వాటిని దిక్కరిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని స్పష్టంగా హెచ్చరించింది. తాము రూపొందించిన గైడ్ లైన్లను అతిక్రమిస్తే మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు సస్పెండ్ చేయడం లేదా ఐపీఎల్ లాంటి బీసీసీఐ నిర్వహించే టోర్నీలలో పాల్గొనకుండా చేయాలని నిర్ణయించింది. గతేడాది సెకండ్ హాఫ్ నుంచి టీమిండియా టెస్టుల్లో ప్రదర్శన పేలవంగా ఉన్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతోపాటు క్లీన్ స్వీప్ కు గురైంది. అలాగే ఆసీస్ టూర్లో 1-3తో సిరీస్ కోల్పోయి పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో బీసీసీఐ తాజాగా దిద్దుబాటు చర్యలకు దిగింది.
అలాంటివి ఇకపై కుదరదు..
టీమిండియా ఆటగాళ్లకు ఇప్పటివరకు బోర్డు ఎన్నో వెసులుబాటులు కల్పించింది. ఇకపై నుంచి అలాంటి వాటికి చోటు ఉండదని ప్రకటించింది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో వెళ్లిపోవడం, ప్రాక్టీస్ సెషన్ మొత్తం గడప కుండా ఉండటం వాటికి చెల్లుచీటీ పడింది. అలాగే దేశవాళీల్లో పాల్గొనడం కూడా తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా యువ ఆటగాళ్లకు దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. మరోవైపు టూర్లలో తమ సహాయక సిబ్బందిని తెచ్చుకునే వెసులుబాటును కూడా ఉపసంహరించుకుంది. మేనేజర్, చెఫ్, సహాయకులు, భద్రతా సిబ్బంది తదితర సౌకర్యాలను ఉపయోగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. జట్టులో అందరూ సమానంగా ఉండాల్సిందేనని, ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పింది. అలాగే పర్యటనల్లో వ్యక్తిగత షూట్లు, ఎండార్స్ చేయకూడదని తెలిపింది. బీసీసీఐ రూపొందించే అన్ని షూట్లలోనూ ప్లేయర్లంతా పాల్గొనాల్సిందేనని కండీషన్లు పెట్టింది. ఇక ఆటపై ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా రానున్న రోజుల్లో మరిన్ని నిబంధనలు అమలు చేయనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.
టూర్లలో కూడా ఆంక్షలు..
తమ కుటుంబ సభ్యులను విదేశాలకు టూర్లతో సహా క్రికెటర్ల తీసుకెళుతుండేవారు. ఇకపై టూర్ మొత్తం కాకుండా నిర్ణీత సమయం వరకే అవకాశం లభించనుంది. అలాగే ఆటగాళ్లందరూ కలిసి ఉండాలని, స్పెషల్ సౌకర్యాలంటూ ఉండవంటూ తేల్చి చెప్పింది. ఇక ప్రయాణ సమయాల్లో కూడా వ్యక్తిగతంగా కాకుండా, అందరూ కలిసి ప్రయాణించాల్సిందేనని తేల్చింది. లగేజీ విషయంలో కూడా 150 కేజీల వరకే చెల్లింపులు చేస్తామని, అది దాటితే ప్లేయర్లే ఖర్చులు భరించాలని తేల్చింది.
ఇక పై నిబంధనల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపులు ఉంటాయని, దానికి హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్, కొన్నిసార్లు బోర్డు పెద్దల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంది. అలాగే వీటిని అతిక్రమించినట్లయితే క్రమ శిక్షణా చర్యలు కఠినంగా ఉండబోతున్నాయని వెల్లడించింది. ఏదేమైనా ఇప్పటికైనా ఆటగాళ్ల పట్ల బోర్డు కఠినంగా వ్యవహరించనుందని, అల్టిమేట్ గా ఇది ఆటకు మేలు జరిగేలా ఉండ బోతుందని పలువురు మాజీ అభివర్ణిస్తున్నారు. ఈ నిబంధనలు తీసుకురాబోయే మార్పులు సమీప భవిష్యత్తులో తెలియనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

