BCCI Vs Gambhir: గంభీర్ కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ నజర్..! డేంజర్లో వారిద్దరూ.. త్వరలో బ్యాటింగ్ కోచ్ నియమించనున్న బోర్డు!!
BCCI Vs Gambhir:గంభీర్ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో గౌరవం. భారత్ సాధించిన 2011 వన్డే, 2007 టీ20 ప్రపంచకప్ ల్లో సత్తా చాటాడు. టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికయ్యాక తన ప్రభ మసకబారుతోంది.

Gautam Gambhir News: భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ దూకుడుకు ముకుతాడు వేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతని హయాంలో భారత జట్టు ఘోర ప్రదర్శనలు చేస్తుండటంతో అతని పనితీరును సమీక్షించాలని నిర్ణయించింది. అలాగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు గడువు పెట్టుకున్న బోర్డు.. అప్పటివరకు మెరుగైన ఫలితాలు రాకపోతే, అతడిని తప్పించేందుకు కూడా ఏమాత్రం వెనుకాడబోదని కథనాలు వెలువడుతున్నాయి. ఇక తను కోచ్ గా వచ్చినప్పుడు తెచ్చుకున్న ఇతర కోచింగ్ సిబ్బందిపైనా దృష్టి పెట్టింది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో అనుబంధం కారణంగా ఆ జట్టు సహచరులతో జట్టును నింపేశాడనే అపప్రథ గంభీర్ పై ఉంది. పేసర్ హర్షిత్ రాణా, సహాయక కోచ్ లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కటే లు కేకేఆర్ తరఫున 2024లో పని చేశారు. ఆ కాలంలో ఆ జట్టుకు మెంటార్ గా గంభీర్ పని చేశాడు. అతని నాయకత్వంలోనే కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ కప్పు కొట్టింది. దీంతో టీమిండియా కోచ్ గాను ఎంట్రీ తనకు దక్కింది.
తన వారితోనే..
గతేడాది శ్రీలంక పర్యటనకు ముందు భారత హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన గంభీర్.. ఏరి కోరి మరీ అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కటేలను భారత కోచింగ్ లోకి తీసుకున్నాడు. అలాగే బౌలింగ్ కోచ్ గా వచ్చిన మోర్నీ మోర్కెల్.. లక్నోసూపర్ జెయింట్స్ తరపున పని చేశాడు. 2023లో గంభీర్ ఆ జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. దీంతో మోర్కెల్ ఎంపికపైనా ఐపీఎల్ ప్రభావం ఉందా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇవేమీ పెద్ద ఇష్యూస్ అయ్యేవి కావు. కానీ, ఎప్పుడైతే భారత జట్టు.. ఇంటా బయట ఘోరంగా ఓడిపోతూ వచ్చిందో జట్టు ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గంభీర్ వచ్చినప్పటి నుంచే జట్టు ఆటతీరు పాతాళానికి చేరుకుందని విమర్శలు వెల్లు వెత్తాయి. అలాగే జట్టులో లుకలుకలు ఏర్పడటానికి తాను కూడా కారణమని ఆరోపణలున్నాయి. మరోవైపు బీసీసీఐ ఇటు ఆటగాళ్లతోపాటు అటు గంభీర్ స్వేచ్ఛపైనా పరిమితులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సహాయక కోచ్ ల పనితీరును మధింపు చేస్తున్నట్లు సమాచారం.
బ్యాటింగ్ కోచ్ తీసుకోవాలని..
మరోవైపు గంభీర్ బాధ్యతలు చేపట్టాకా.. బ్యాటింగ్ కోచ్ అంటూ ఎవర్ని తీసుకోలేదు. స్వతహాగా తను బ్యాటర్ కావడంతో వేరే ఇతరుల అవసరం లేదని గంభీర్ భావించినట్లున్నాడు. అయితే ఇప్పుడు అదనంగా బ్యాటింగ్ కోచ్ ను కూడా నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత బలమైన బ్యాటర్లే గాడి తప్పి, విఫలమవుతుండటంతో కోచ్ తప్పనిసరి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా భారత బ్యాటింగ్ కోచ్ గా పనిచేయాలని ఉందని ఇంగ్లాండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ మనసులో మాటలను బయట పెట్టాడు. మూడు ఫార్మాట్లలోనూ మంచి ఆటగాడిగా పేరున్న పీటర్సన్ గతంలో ఐపీఎల్లోనూ ఆడాడు. త్వరలో ఐపీఎల్ కు వ్యాఖ్యాత గా కూడా వ్యవహరించబోతున్నాడు. అయితే అతనికి కోచింగ్ అనుభవం లేదు. దీంతో అతడిని కోచ్ గా తీసుకోవడం కాస్త రిస్కేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు భారత జట్టు ఇంటా బయట ఓడిపోయాక, ఇప్పుడు రిపేర్లకు బీసీసీఐ దిగడంపై పలువురు మాజీలు పెదవి విరుస్తున్నారు.
Also Read: BCCI Ban: 'ఆ రూల్ కఠినంగా అమలు చేయండి' - బీసీసీఐకి దిగ్గజ కామెంటేటర్ సూచన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

