CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానాలు పంపనున్నారు.

Telangana Rising Global Summit | హైదరాబాద్: డిసెంబరు 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది.
ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని సైతం నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎవరిని ఆహ్వానించారు, ఎవరు ఆహ్వానించారు.. వారి రాకను నిర్ధారించడంతో పాటు సదస్సుకు వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని.. అందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
విజన్ డాక్యుమెంట్ 'తెలంగాణ రైజింగ్ 2047'
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు తరాల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ రూపంలో జాతికి అంకితం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి, మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజన్ డాక్యుమెంట్ ను 'తెలంగాణ రైజింగ్ 2047' గా పిలుస్తున్నారు. ఇందులో విజన్ మరియు స్ట్రాటజీ అనే రెండు కీలక అంశాలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మంది భాగస్వాములను చేస్తూ, నీతి అయోగ్ మరియు ఐఎస్బీ (ISB) వంటి సంస్థల సహకారంతో దీనిని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి, భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

3 భాగాలుగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా 3 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది, అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి ప్రాంతం. దీనిని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా చూస్తున్నారు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత సిటీగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్ అర్బన్ రీజన్ ను సర్వీస్ సెక్టార్‌గా మారుస్తూ, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ఈ కోర్ అర్బన్ రీజన్ లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కీలక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.
అవుటర్ రింగ్ అవతలి భాగంలో రీజినల్ రింగ్ రోడ్లు (RRR) రాబోతున్నాయి. సుమారు 360 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజినల్ ఎకానమీగా పిలుస్తారు. ఈ రీజియన్ లో భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవేలు మరియు బుల్లెట్ ట్రైన్ వంటివి రాబోతున్నాయి. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీని తీసుకువస్తున్నారు. అంతేకాకుండా, తెలంగాణలో మరిన్ని ఎయిర్ పోర్టులు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, మరియు రామగుండంలో ఎయిర్ పోర్టులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైవే, పోర్ట్, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనేది లక్ష్యం.
క్యూర్, ప్యూర్, రేర్ అంశాల కోణంలో తెలంగాణ ముఖచిత్రం
రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని మూడో రీజియన్‌గా చూస్తున్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖచిత్రాన్ని క్యూర్ (Cure), ప్యూర్ (Pure), రేర్ (Rare) అనే మూడు అంశాల కోణంలో చూస్తున్నామని, ఈ మూడింటిని క్రోడీకరించి 'తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్' ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు. దేశానికి అవసరమైన దానికంటే ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పోషక విలువలు ఉన్న (న్యూట్రిషన్) ఫుడ్ అందించలేకపోతున్నామని గుర్తించారు. అలాగే, అందరికి విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య మరియు సాంకేతిక విద్య అందుబాటులో లేదని తెలిపారు. అందుకే అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి, తెలంగాణను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మా దార్శనికతనే మా భవిష్యత్తు ప్రణాళికలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' కు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రణాళికల కోసం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వార్ రూం ఏర్పాటు చేశారు. చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాలను తమ రోల్ మోడల్ గా తీసుకుని, వాటినే ఆదర్శంగా తీసుకుని పోటీ పడతామని, ఆంధ్ర, తమిళనాడు లేదా మరే ఇతర రాష్ట్రం తమకు పోటీ కాదని అన్నారు. విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు.






















