Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
Nizamabad News: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
National Turmeric Board In Nizamabad Launched By Union Minister Piyush Goyal: నిజామాబాద్ జిల్లా (Nizamabad District) రైతుల ఏళ్ల కల నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు (Turmeric Board) నిజామాబాద్‌లోని ఇందూరులో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గోయల్‌కు ఆయన శాలువా కప్పి సన్మానించారు. కాగా, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023, అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ ప్రకటించారు. దీని తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో ప్రస్తావించలేదు. తాజాగా, నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
కాగా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అటు, పసుపు బోర్డు ఏర్పాటుపై అన్నదాతలు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల కల సాకారమైందని చెబుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్మెంట్ మార్కెట్ వరకూ రైతులకు లబ్ధి కలుగుతుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు. పసుపు తవ్వకం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లోనూ దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది.
దేశంలోనే రెండో స్థానం
ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అత్యధికంగా పసుపు సాగవుతుంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలో 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా సుమారు 62 శాతంగా ఉంది. ఇక నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడం సహా ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కు ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా పసుపు బోర్డు చేయూత అందిస్తుంది. ఇందులో కేంద్ర ఆయుష్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందిన వారిని సభ్యులుగా నియమించనున్నారు. పసుపును అధికంగా పండించే 3 రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులకు రొటేషన్ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర పరిశోధన సంస్థల్లో పని చేసే నిపుణులు, పసుపు రైతులు, ఎగుమతిదారులకూ సభ్యత్వం కల్పిస్తారు.
Also Read: Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి