ICC Champions Trophy: పీసీబీ తుగ్లక్ నిర్ణయం..! నిజాలు బయటకు రాకుండా వారిపై ఆంక్షలు విధింపు
2017లో భారత్ పై నెగ్గి చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగబోతోంది. వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీకి సంబంధించి స్టేడియాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని టాక్.

PCB Vs ICC: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎప్పుడైతే తలకెత్తుకుందో, అప్పటి నుంచే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఏది కలిసి రావడం లేదని తెలుస్తోంది. ఐసీసీ ద్వారా ఒత్తిడి పెంచి భారత్ ను తమ దేశంలో పర్యటించి, తద్వారా దివాళా తీసిన తమ బోర్డును బాగు పర్చాలనుకున్న ప్లాన్ అడ్డంగా ఫ్లాపైంది. దానికి తోడు స్టేడియాల పునర్నిర్మాణం ప్రక్రియ నవ్వుల పాలు అవుతోంది. స్టేడియాల నిర్మాణ పనులు ఎప్పటిప్పుడు వీడియోల రూపంలో బయటకు వస్తుండటంతో పీసీబీకి చెడ్డ పేరు వస్తోంది.
ఇంకా స్టేడియాల నిర్మాణం కాలేదని, అసలు చాంపియన్స్ ట్రోఫీ ఉంటుందా..? లేదా అనే డౌట్లు రేకెత్తేలా పలువురు వార్తలు వండి వారుస్తున్నారు. దీనిపై పీసీబీ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఎవరు పడితే వాళ్లని స్టేడియంలోకి అనుమతించకుండా ఆర్డర్ వేసింది. మీడియా ప్రతినిధులు కూడా పీసీబీ చెప్పిన రోజే, వాళ్ల మనుషుల సమక్షంలో ఫొటోలు తీసుకోవాలని ఆంక్షలు విధించింది. దీనిని తుగ్లక్ నిర్ణయంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి కాని నిర్మాణాలు..
మరోవైపు మెగాటోర్నీ నిర్వహణ దాదాపు నెలరోజుల దగ్గరికి వచ్చినా, ఇప్పటికీ స్టేడియాల ఆధునీకీకరణను పీసీబీ పూర్తి చేయాలేదు. మ్యాచ్ లు నిర్వహించే కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్ లోని గడాఫీ స్టేడియం, రావల్పిండిలోని స్టేడియంలలో నిర్మాణ పనులు సా...గుతూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు వీడియోలతో సహా కథనాలు వండి వార్చారు. దీంతో అంతర్జాతీయంగా పీసీబీ పరువు మురికి కాలువలో కలిసింది. స్టేడియాలను కట్ట చేతగాని వాళ్లకు ఇంత పెద్ద ట్రోఫీ నిర్వహణ పనులను ఎలా అప్పగిస్తారంటూ విసుర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కథనాలతో విదేశాల్లో స్టోరీలు రావడంతో పీసీబీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా అయింది. దీంతో అసలు మీడియానే స్టేడియాల పరిసరాలకు రాకుండా ఆంక్షలు విధించింది. దీనిపై ప్రస్తుతం మీడియాలో నిరసన వ్యక్తం అవుతోంది. పీసీబీ చెప్పినట్లు ఆడాల్సిన ఖర్మ తమకు లేదని పలువురు విమర్శిస్తున్నారు.
కవరింగ్ చేసుకుంటున్న పీసీబీ..
మరోవైపు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఈ నిర్ణయాన్ని పీసీబీ సమర్థించుకుంటుంది. స్టేడియాలపై అవాస్తవ కథనాలతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంది. దుష్ప్రచారం కారణంగా అసలు టోర్నీనే పాక్ నుంచి వెళ్లిపోతుందని పలువురు పేర్కొంటున్నట్లు వెల్లడించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎవరు పడితే వాళ్లు సెల్ఫోన్లు, కెమేరాలతో వచ్చి వీడియోలు తీస్తూ జరుగుతున్న నిర్మాణాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, వారిని అదుపు చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఏదేమైనా త్వరలోనే పాక్ లోని స్టేడియాలను ఐసీసీ టీమ్ తనిఖీ చేయనుంది. ఆ తర్వాత అధికారికంగా నిర్మాణ పనుల గురించి వివరాలు తెలుస్తాయి. మరోవైపు వచ్చేనెల 19 నుంచి న్యూజిలాండ్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ తో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. దుబాయ్ లో భారత్ మ్యాచ్ లు ఆడుతుంది. ఫిబ్రవరి 20 న బంగ్లాదేశ్ తొలి లీగ్ మ్యాచ్ ను ఆడుతుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాక్ తో, మార్చి 2న కివీస్ తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
Also Read: ICC Champions Trophy: పీసీబీ సూపర్ స్కెచ్..! భారత మ్యాచ్ ల ద్వారా లబ్ధి పొందాలని ఎత్తుగడలు




















